ఆన్‌లైన్ మోసం మరోమారు బహిర్గతమైంది. ఈ-కామర్స్ వ్యాపారం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అదేసమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ మోసం కూడా. రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఫోను కోసం ఆర్డర్ చేస్తే రూ.20 విలువ చేసే విమ్‌బార్‌ను పార్శిల్‌లో పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జొన్నాదుల హేమవరప్రసాద్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫోన్ కోసం రూ.9,800 చెల్లించి ఫోన్‌కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత సదరు కంపెనీ పంపిన పార్శిల్‌ను విప్పి చూడగా, అందులో 20 రూపాయల విలువ చేసే సబ్బును పార్శిల్‌లో ఉంచింది.
దీనిపై అతను స్పందిస్తూ... తాను ఈ నెల ఒకటో తేదీన పానసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కోసం డబ్బుచెల్లించి అమెజాన్ కంపెనీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు హేమవరప్రసాద్ తెలిపాడు. బ్లూడాట్ కొరియర్ సర్వీస్ డెలివరీ బాయ్ తనకు ఓ ప్యాకెట్‌ను ఇచ్చాడని, దాన్ని వెంటనే తెరచి చూశానని చెప్పాడు. అయితే, అందులో తన ఇచ్చిన ఆర్డరు లేదని విమ్‌బార్ సబ్బు ఉందని చెప్పాడు.