ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి లైవ్ లొకేషన్ షేరింగ్ కాగా, రెండోది ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్. లైవ్ లొకేషన్ షేరింగ్ సాయంతో వాట్సాప్ వినియోగదారులు తాము ఉన్న స్థానాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. లొకేషన్ పంచుకునే సదుపాయం ఇప్పుడు కూడా వాట్సాప్‌లో ఉంది. కాకపోతే ఈ లైవ్ లొకేషన్ ద్వారా స్థానాన్ని మరింత ఖచ్చితత్వంతో పంచుకోవచ్చు. అంటే సరిగ్గా నిల్చున్న చోటును స్నేహితులకు పంపుకోవచ్చు.
అంతేకాకుండా టైమర్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉండనుంది. దీని వల్ల మన లొకేషన్‌ను ఎంతసేపు పంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఈ సదుపాయం వల్ల పిల్లలు, మహిళలకు మరింత ఉపయోగం చేకూరనుంది. లొకేషన్ పంచుకోవడంతో పాటు, ఎంతసేపు అదే స్థానంలో ఉండబోతున్నారో కూడా తెలియజేసే వీలుంది. ఈ వారం అప్‌డేట్‌తో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ఇక రెండో ఫీచర్ ఏంటంటే... యూజర్లు మొబైల్ నంబర్లు చేంజ్ చేసినప్పుడల్లా ఆ విషయాన్ని తెలియజేస్తూ కొత్త మొబైల్ నంబర్‌ను వేరే మార్గాల్లో ఇతరులకు చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. వాట్సాప్‌లో రానున్న ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్ ద్వారా యూజర్లు చేంజ్ అయిన తమ మొబైల్ నంబర్ గురించిన నోటిఫికేషన్‌ను అవతలి యూజర్‌కు పంపవచ్చు.
దీంతో అవతలి వ్యక్తులకు ఆ సందేశం చేరుతుంది. ఫలానా యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు లభ్యం కానున్నాయి. ఇక దీంతోపాటు త్వరలో అందించనున్న అప్‌డేట్ ద్వారా వాట్సాప్ యాప్ సైజ్‌ను కూడా భారీగా తగ్గించనున్నారు.