త్వరలో రోడ్లపైకి మానవరహిత వాహనాలు

FileFILE
హాలీవుడ్ జేమ్స్‌బాండ్ తరహా కొన్ని చిత్రాల్లో వాహనాలు వాటికవే డ్రైవ్ చేసుకుంటూ సర్రున రోడ్లపై వేగంగా వెళుతుండటం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి వాహనాలు నిజంగానే రోడ్లపై పరుగెడితే.. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ... త్వరలో ఇది నిజం కాబోతోంది. అలాంటి మానవరహిత వాహనాలు త్వరలో రోడ్లపై నడిచే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు ప్రముఖ వాహన నిపుణులు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని ఈ తరహా వాహనాలు రానున్నాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఇలాంటి వాహనాలనే 'అటానమస్ వెహికల్ నావిగేషన్' అంటారు. అంటే వాహనం తనకు తాను నడవడం. దీనినే 'మానవ రహిత వాహనం' అని కూడా అంటారు.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తూ, ట్రాఫిక్‌లోను, సిగ్నల్స్ వద్ద నిబంధనలకు తగ్గట్టుగా నడిచే విధంగా ఈ మానవరహిత వాహనాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి తరహా వాహనాలను భద్రతాదళాల కోసం రూపొందిస్తున్నారు.

అదలా ఉంచితే.. డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డీఏఆర్‌పీఏ) ఇలాంటి తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం డీఏఆర్‌పీఏ ఒక పోటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పోటీలో.. ఆరు గంటల్లో ట్రాఫిక్‌ను ఛేదించుకుంటూ 60 మైళ్లు దూరం చేరుకోగల అత్యంత వేగంగా వెళ్లగల మరియు సురక్షితమైన వాహన డిజైన్‌ను ఎవరైతే తామిచ్చిన గడువులోగా తయారు చేయగలరో వారికి 3.5 మిలియన్ డాలర్లు బహుమతిని ఇస్తామని ప్రకటించింది.

కాగా ఈ పోటీలో మొత్తం 89 అంతర్జాతీయ బృందాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. గడువు సమయంలోగా కేవలం ఆరు సంస్థలు మాత్రమే
ఈ మానవరహిత వాహన నమూనాని తయారు చేయగలిగాయి.

ఈ ఆరింటిలో ప్రముఖ అంతర్జాతీయ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్‌ (జీఎం)కు చెందిన వెండే ఝాంగ్ (వాహనతయారీ రూపకల్పన బృందం) తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ సంస్థకు చెందిన బృందం గంటకు 13 మైళ్ల వేగంతో నడిచే మానవరహిత వాహన నమూనాని తయారు చేసింది.

కాగా, ఇప్పటికే లేన్ మార్కర్లను గుర్తించడం వంటి తరహా పరిజ్ఞానాన్ని జీఎం తమకు చెందిన కొన్ని వాహనాలకు ఉపయోగిస్తోంది. లేజర్ కెమేరాలు, సెన్సర్లు తదితరమైనవి కూడా వాహనాల్లో ఉపయోగపడే విధంగా జీఎం వృద్ధి చేసింది. కనుక త్వరలోనే మానవరహిత వాహనాలు మనం చూడబోతున్నాం అన్నమాట.

అయితే ఇలాంటి తరహా వాహనాలు మరికొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉందంటున్నారు కొందరు నిపుణులు. వాటన్నింటినీ సరిచేసుకుని పరీక్షల్లో విజయం సాధించిన తర్వాతే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి