జియో ఎఫెక్ట్.. స్మార్ట్ ఫోనులో నాలుగైదు సిమ్‌లుంటే ఎంత బావుండో..

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (19:48 IST)
రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతో ఇతర టెలికామ్ ఆపరేటర్లకు సవాల్‌గా మారింది. వినూత్నమైన టారిఫ్ ప్లాన్స్‌తో రిలయన్స్ జియోకు పోటీనిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. జియోకు ధీటుగా ఇతర టెలికామ్ కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో నెట్‌ వర్క్ కంపెనీలు ఇచ్చే వరుస ఆఫర్లతో కస్టమర్లు తెగ ఖుషీగా ఉన్నారు. ఏ నెట్‌వర్క్ ఎంచుకోవాలో అర్థం కాక.. స్మార్ట్‌ ఫోన్‌‌లో నాలుగైదు సిమ్‌‌లుంటే ఎంత బాగుంటుందని వినియోగదారులు భావిస్తున్నారు. జియో ప్రారంభించిన ఈ పోరులో ఇతర సంస్థలు కూడా జత కలవడంతో.. డేటా ప్యాక్ ధరలను భారీగా తగ్గిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో దెబ్బతో దిగొచ్చిన ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలతో పాటు బీఎస్ఎన్‌ఎల్ కూడా ఆఫర్ల బాట పట్టింది. 
 
తాజాగా జియోకి గట్టి పోటీ ఇస్తున్న దిగ్గజ నెట్‌ వర్క్ కంపెనీ ఎయిర్‌ టెల్ మరో ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించింది. నెలంతా ఇంటర్నెట్ పేరుతో రూ.29 ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌‌ని ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం కస్టమర్లు 30 రోజుల పాటు 75 ఎంబీ 2జీ, 3జీ, 4జీ డేటాను పొందవచ్చునని సంస్థ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి