ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

సోమవారం, 5 జులై 2021 (20:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 72,731 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 583 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 316 కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 22 కేసులను  గుర్తించారు. శ్రీకాకుళంలో 48, కర్నూలులో 50, అనంతపురంలో 60, విశాఖ జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయి.
 
 
అదేసమయంలో 3,435 మందికి కరోనా వైరస్ నుంచి కోలుకోగా, 26 మంది మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,05,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,58,189 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,964 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,870కి పెరిగింది.
 
మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఇంకా తగ్గని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. సాయంత్రం 6 గంటలకు దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.
 
అలాగే, రెస్టారెంట్లు, జిమ్‌లు, కళ్యాణమండపాలు తెరుచుకోవడానికి జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ప్రజలందరూ తప్పనిసరిగా శానిటైజర్ వాడటంతో పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించింది. 
 
అటు థియేటర్ల అనుమతికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు