విశాఖ సదస్సులో పెట్టుబడుల వరద.. వైఎస్ జగన్ కంటిమీద కునుకులేదా

ఆదివారం, 29 జనవరి 2017 (03:19 IST)
విశాఖ సదస్సులో ఆంద్రప్రదేశ్‌కు వచ్చిపడుతున్న పెట్టుబడుల వరదకూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు నిద్ర రాకుండా పోవడానకి ఏదయినా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీలూ నేతలు. ఈ ఆరోపణ చేయడమే కాకుండా పనిలో పనిగా జగన్‌కు పిచ్చి పట్టిందని, ముఖ్యమంత్రిని అయిపోతానని కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. 
 
విశాఖ సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని మంత్రి రావెల కిశోర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధిలో ఏపీ వెనుకపడితే అధికారంలోకి రావొచ్చని కలలు కంటున్నారని ఆక్షేపించారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరు టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రావెల మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. 
 
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. తన తల్లి విజయలక్ష్మిని ఓడించిన విశాఖ అభివృద్ధి కాకుండా.. నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ విమర్శించారు. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు తరలివస్తుంటే అక్కడ ఆయన ఆందోళనకు పూనుకోవడంపై మండిపడ్డారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ సీఎం రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తే... ఎద్దేవా చేశారన్నారు. జగన్‌కు ‘సీఎం పదవి పిచ్చి’ పట్టిందని ధ్వజమెత్తారు. 
 
ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటారని, ఒకే సమయంలో ఇద్దరు ఉండరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ‘జగన్‌ తనను తాను ముఖ్యమంత్రిగా ఊహించుకోవడం, ప్రచారం చేసుకోవడం, చెప్పుకోవడం తగదు. ఆయనకు ప్రజల మద్దతుపై నమ్మకం లేదు. జ్యోతిష్కులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఏడాదే సీఎం అవుతాననే భ్రమల్లో ఉన్నారు. ఆయనకు పిచ్చిపట్టింది. విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధినిరోధకుడిలా తయారయ్యారు’ అని దుయ్యబట్టారు. 
 
రాష్ట్రానికి జగన్‌ అరాచకశక్తిలా మారారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు శ్రీకాకుళంలో మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా లాభిస్తుందా.. ప్యాకేజీ వల్ల మేలు కలుగుతుందా అనేది చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. విశాఖ సదస్సును అభాసుపాలు చేసి రాష్ట్రానికి నిధులు రానివ్వకుండా జగన్‌ కుయుక్తులు పన్నారని ఆరోపించారు. చిన్నప్పడు ఆయన్ను ఏవిధంగా పెంచారో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావుకే తెలుసన్నారు. 

వెబ్దునియా పై చదవండి