పిల్లలు అంతులేని అల్లరివల్లనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా..?!

FILE
తింటున్న ఆహార పదార్థాలన్నింటినీ కింద పోసేసినా, ముఖ్యమైన కాగితాలను చించి పారేసినా, ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందరవందర చేసేసినా.. ఇదంతా పిల్లల బాల్యంలో భాగమేనని చెప్పవచ్చు. ఇలాంటి అంతంలేని అల్లరివల్లనే పిల్లలు వారి ఆరోగ్యాన్ని భేషుగ్గా కాపాడుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొన్ని వస్తువులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు. చిరాకు తెప్పించేలా ఉండే ఈ చిన్నారుల పనులన్నీ రాబోయే రోజుల్లో వారి నైపుణ్యాలను బయటికి తెచ్చేందుకు బాగా పనికివస్తాయి.

ఇక చిన్న పిల్లలకు భోజనం పెట్టే విషయమయితే ప్రతి తల్లికీ ఓ కసరత్తు లాంటిదే. నాకు ఇది వద్దు, అది వద్దు, అదే కావాలి, ఇది బాగా లేదు.. అంటూ పిల్లల మారాం ప్రతి ఇంట్లోనూ నితృకృత్యాలే. అలాంటి పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని పిల్లల నిపుణులు చెప్పినప్పుడు భోజనం విషయంలో చిన్నారుల్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. భయపెట్టో, బుజ్జగించో, లాలించో.. వారు వద్దు తల్లో అంటున్నా బలవంతంగా పిల్లలకు తినిపించకూడదు.

పట్టలేనంత ప్రేమ, అతి కాఠిన్యం రెండూ చిన్నారుల్ని తప్పుదోవ పట్టిస్తాయి. ప్రస్తుతం చిన్న వయసులోనే పిల్లలకు ఎంతో విషయ పరిజ్ఞానం అలవాటు అవుతోంది. ఈ విషయంలో మీడియా పాత్ర ఎక్కువనే చెప్పవచ్చు. అలా చిన్నప్పటినుంచే ఎంతో విజ్ఞానవంతంగా ఉండే పిల్లలు మనలాగే ఉండానే, మనల్నే అనుసరించాలని పెద్దలు ఆశించకూడదు. వారి ప్రత్యేక ప్రపంచంలో వారిని వదిలి వేస్తునే, కొన్ని నియమాలను మాత్రం తప్పకుండా పాటించేలా, వాటిని మీరకుండా ఉండాలనే షరతులు విధించటం తప్పనిసరి.

పిల్లల్ని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఆడుకోనివ్వాలి. విశాలమైన మైదానంలో పరుగులు పెట్టనివ్వాలి. హాయిగా ఆటలు ఆడుకునేందుకు పిల్లలకి అవకాశం ఇస్తే.. ఉద్యోగ కారణాలవల్ల మీరు వారికి దూరంగా ఉండాల్సి వచ్చినా పెద్దగా ఒంటరితనానికి లోనుకారు. పిల్లలతో ఆధిపత్య ధోరణితో కాకుండా ఆత్మీయంగా మాట్లాడి వారికి మంచి స్నేహితులుగా మెలగాలి. వారికి నచ్చిన హాబీలలో పాలు పంచుకునేలా చేయాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో పైన చెప్పుకున్న విషయాలను పాటించినట్లయితే.. పిల్లలలంతా అభివృద్ధి చెందిన నైపుణ్యాలతోపాటు, ఆరోగ్యవంతంగా ఉంటారు.

వెబ్దునియా పై చదవండి