పౌష్టికాహార లోపంతో చిక్కిపోతున్న "బాల్యం"

FILE
"నేటి బాలలే రేపటి పౌరులు" అని ఎంత గొప్పగా, గర్వంగా చెప్పుకున్నప్పటికీ.. ఆ బాలలు మాత్రం భారతదేశంలో పౌష్టికాహార లోపంతో నానాటికీ చిక్కిపోతున్నారని ప్రపంచబ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో అల్లాడుతున్న బాధితులకు భారత్ మాతృదేశంగా మారిందని నివేదికలతో సహా వెల్లడించింది.

మూడు సంవత్సరాల లోపు చిన్నారులలో వయసుకు తగిన బరువులేని పిల్లలు 46 శాతం, సరైన ఎదుగుదల లేని చిన్నారుల్లోని 36 శాతం మంది ఒక్క భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంక్ నివేదిక పేర్కొంది. వేగవంతమైన అభివృద్ధి, జీడీపీలో అనూహ్య పెరుగుదల లాంటివేమీ భారత్‌ను ఈ సమస్య నుంచి గట్టెక్కించలేక పోతున్నాయని ప్రపంచబ్యాంక్ తేల్చి చెప్పింది.

భారత్‌లో పౌష్టికాహార లోపంపై ప్రపంచబ్యాంక్ తాజాగా ఒక నివేదికను వెలువరించింది. 1998లో చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య గణన (ఎన్ఎఫ్‌హెచ్ఎస్)తో పోలిస్తే, 2005లో చేపట్టిన మూడో ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌లో భారతదేశం నామమాత్రపు అభివృద్ధిని మాత్రమే సాధించినట్లు పేర్కొంది. ఆర్థిక వృద్ధి, ఆహార భద్రత సాధించినా.. ఇప్పటికీ పలు దక్షిణాసియా దేశాలు పౌష్టికాహార లోపం, మెరుగైన సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉన్నాయని ఆ నివేదిక తేటతెల్లం చేసింది.

అందరికీ ఆరోగ్యం అందని ద్రాక్షపండులాగే మిగిలిపోతోందని పై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గర్భిణీ స్త్రీలకు సరైన ఆరోగ్య వసతులు కల్పించని కారణంగా కూడా ప్రసూతి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని కూడా తెలిపింది. అలాగే భారత్‌లో 54 శాతం ఎస్సీ, ఎస్టీ చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పింది.

విటమిన్ ఏ, ఐరన్, అయోడిన్ లోపాలతో ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ.. వయసుకు తగ్గ బరువులేని బాలలు 51 శాతం, సరైన ఎదుగుదల లేని చిన్నారు 46 శాతంమంది గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారనీ, అదే పట్టణాలలో వీరి శాతం వరుసగా 40, 33గా ఉందని పై నివేదిక తెలిపింది.

ఈ నేపథ్యంలో బాలల సంక్షేమానికి భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను చేపడుతున్నా... వాటికి అవసరమైన అదనపు వనరులను చేకూర్చటం లేదని ప్రపంచబ్యాంక్ వ్యాఖ్యానించింది. ఈ పథకాలను సమన్వయ పరచటం, నియంత్రణ చేయటం అనేది చాలా వరకు కాగితాలకే పరిమితమవుతోందని.. అలా కాకుండా చూడాలని సూచించింది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం మేల్కోకపోతే, చిన్నారుల ఆరోగ్య భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రపంచబ్యాంక్ సలహా ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి