యూకేలో ఘనంగా "తాల్" బాలల దినోత్సవం..!

FILE
భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 14వ తేదీన నిర్వహించే "బాలల దినోత్సవం"ను లండన్ తెలుగు సంఘం (తాల్) ఘనంగా జరుపుకుంది. సౌతాల్‌లోని ఫీదర్‌స్టోన్ హైస్కూలు ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

తాల్ అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజు బాలల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం లండన్‌లో ఇటీవల రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయిన తెలుగు విద్యార్థి చంద్రశేఖర్‌కు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చంద్రశేఖర్‌కు ఆత్మశాంతి కలగాలని తాల్ సభ్యులంతా మౌనం పాటించారు.

ఆ తరువాత తాల్ సభ్యత్వ కార్యదర్శి సంజయ్.. నెహ్రూ, భారతదేశం, భారత బాలల గొప్పదనాన్ని తెలుపుతూ చిత్ర ప్రదర్శన ఇచ్చారు. తదనంతరం జరిగిన పోటీలలో పిల్లలు మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, కృష్ణుడు, గోపిక, రావణుడు, హనుమంతుడు, ఆండాలమ్మ, బడి పంతులమ్మ, లంబాడీ.. తదితర వేషధారణలతో అలరించారు.

ఇంకా చిన్నారులు ఆలాపించిన పలు దేశభక్తి గీతాలు విదేశాల్లో తెలుగు భాష ఉనికిని చాటేలా మార్మోగాయి. అలాగే.. వివిధ సందేశాలతో పిల్లలు ప్రదర్శించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. క్విజ్, ఆటల పోటీలలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా... ఈ వేడుకలకు చిన్నారులే వ్యాఖ్యాతలుగా వ్యవహరించటం మరింత విశేషంగా చెప్పవచ్చు.

వెబ్దునియా పై చదవండి