లైంగిక వేధింపులతో పిల్లల్లో మెదడు సంబంధిత వ్యాధులు..!!

FILE
నేడు మన సమాజంలో ప్రతిరోజూ చిన్నారులు ఆడ, మగ తేడా లేకుండా అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. వీరిపై నిరంతరం జరుగుతున్న లైంగిక వేధింపులు, వారి భావోద్వేగాలను ప్రభావితం చేసేలా పెద్దలు నిర్లక్ష్యానికి గురిచేయటం తదితర సమస్యలు.. వారి పసిమనసులను గాయపరచటమేగాకుండా, పెరిగి పెద్దయ్యేకొద్దీ మెదడుకు సంబంధించిన వ్యాధులతో సతమతం అయ్యే అవకాశాలను పెంచుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

అదే విధంగా చిన్నారుల్ని లైంగికంగా వేధించటం, నిర్లక్ష్యం చేయటం అనేవి వారు పెరిగి పెద్దయ్యాక అరాచకవాదులుగా, తిరగబడే స్వభావం కలిగినవారిగా తయారు చేయటమేగాకుండా.. పలురకాల వ్యాధులకు గురిచేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎమ్ఆర్ఐ) ద్వారా కొంతమంది పిల్లలపై వివిధ రకాల పరిశోధనలు చేపట్టిన పరిశోధకులు పై విషయాన్ని స్పష్టం చేశారు.

పిల్లలపై లైంగిక వేధింపులు, నిర్లక్ష్యం.. అనేవి జన్యుపరమైన కారణాలతో జత కలిసినప్పుడు కూడా మెదడు సంబంధిత వ్యాధులబారిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు తేల్చి చెబుతున్నారు. తాము చేపట్టిన ఈ ఆధునిక న్యూరో బయలాజికల్ అధ్యయనంలో ఒత్తిడి, జన్యుపరమైన అంశాలతో కలసి మెదడు పనితీరు, నిర్మాణాలను ఏ విధంగా దెబ్బతీస్తుందనే విషయాలను అర్థం చేసుకున్నామని వారంటున్నారు.

ఒత్తిడి, ఇతర కారణాలు పిల్లలను ఎలా డిప్రెషన్‌, ఆత్మన్యూనతకు గురిచేస్తాయో కూడా అర్థమైందనీ ఈ పరిశోధన ద్వారా అర్థమైందని పరిశోధకులు వివరించారు. మెదడులో జరిగే సునిశితమైన మార్పులే ఈ డిప్రెషన్‌కు కారణం అవుతున్నాయనీ.. ఇలాంటివారిని బయటపడేయాలంటే వీలైనంత తొందరగా జోక్యం చేసుకుని తగిన చికిత్సను అందించాలంటున్నారు. అలాగే డిప్రెషన్ బారినపడిన బాలలు సమాజానికి హానికరంగా మారకుండా నియంత్రించాలంటే, సత్వర చికిత్స అత్యంత ఆవశ్యమని చెబుతున్నారు.

తమ అధ్యయనంలో భాగంగా.. విపరీతమైన డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన 18 నుంచి 65 ఏళ్ల మధ్యగల 24 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. బాల్యం నాటి ఒత్తిడుల గురించిన అంచనాలతో పాటూ వారిపై ఎమ్ఆర్ఐ ద్వారా పరిశోధనలు చేశారు. మెదడుకు సంబంధించి బ్రెయిన్‌ రీజియన్‌లను విశ్లేషణ చేయడానికి ప్రత్యేకమైన ప్రోగ్రాంలను వినియోగించి పై విషయాలను అర్థం చేసుకున్నారు. కాబట్టి, బాల్యంలో వేధింపులకు గురయ్యే చిన్నారులు సమాజానికి హానికరం కాకుండా ఉండాలంటే, వారి సమస్యలను వెంటనే అర్థం చేసుకుని తల్లిదండ్రులు తగిన చికిత్సను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెబ్దునియా పై చదవండి