సమయాన్ని, డబ్బును సద్వినియోగం చేస్తేనే విజేత..!!

FILE
సమయాన్ని, డబ్బును సద్వినియోగం చేసుకున్న వ్యక్తే జీవితంలో విజేతగా నిలుస్తాడని పెద్దలు చెబుతుంటారు. అదే విధంగా డబ్బుకంటే సమయం విలువ ఎక్కువని నిరూపించబడిన సత్యం కూడా. మరి పిల్లలూ.. మీరు సమయాన్ని వృధా చేస్తున్నారో, సద్వినియోగం చేసుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా..?

అలా ఆలోచించినట్లయితే.. మీరు ఎంతగా సమయాన్ని వినియోగించుకుంటున్నారో పరిశీలిద్దాం. స్కూలుకి స్కూల్ బస్సులో వెళ్లేటప్పుడు నిద్రపోవటమో, కిటికీలోంచి వీధుల్లోని వ్యక్తులను, అక్కడ జరిగే విషయాలను గమనించటమో లేదా ఫ్రెండ్స్‌తో తగువు పెట్టుకోవటమో లాంటివి చేస్తుంటారు కదా..! ఇలా చేస్తే సమయం వృధా అయినట్లే. అందుకనే అలా కాకుండా ఉండాలంటే.. సీట్లో కళ్లుమూసుకుని వెనక్కి వాలి అంతకు ముందురోజు టీచర్ చెప్పిన పాఠాలను గుర్తుకు తెచ్చుకుంటే సమయం వృధా కాకుండా కాపాడుకున్నట్లే.

అదే విధంగా స్కూల్ నుంచి రాగానే హోంవర్కు చేయకూడదు. ఎందుకంటే.. అసలే అలసిపోయి వచ్చిన మీరు.. ఆ స్థితి నుంచి బయటపడేందుకు కాసేపు ఆటలాడుకోవాలి. ఆ తరువాత స్నానంచేసి, ఏదైనా టిఫిన్ తిని, ఆపై హోంవర్క్ చేసేందుకు కూర్చోవాలి. ఇక హోంవర్క్ చేసేటప్పుడు కూడా ఒక నిమిషంలో అయ్యేపనికి 5 నిమిషాలు కేటాయించినట్లయితే సమయం వేస్ట్ అయినట్లే. అలా కాకుండా హోంవర్కును వేగంగా తప్పులులేకుండా నిర్దిష్ట సమయంలోనే పూర్తి చేసేలా ప్రాక్టీసు చేయాలి.

ఏదైనా పనిని ఒక ఖచ్చితమైన టైంలో పూర్తి చేయాలని నిర్ణయించుకోకపోతే దానిపై ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత లేకపోతే ఆ పనిని యాంత్రికంగా ముగిస్తామేగానీ, దానిపై ఆసక్తి ఉండదు. మెదడు కూడా దాన్ని స్వీకరించదు. కాబట్టి హోంవర్కుకు కొంత సమయాన్ని కేటాయించుకుని, ఆ సమయంలోనే దాన్ని పూర్తి చేసేలా వేగంగా రాసే అలవాటును పెంపొందించుకోవాలి.

ఇక టీవీ చూడటం, కంప్యూటర్‌లో ఆడుకోవటం లాంటి వాటికి వస్తే క్షణాలు, నిమిషాలు, గంటలు కరిగిపోతూనే ఉంటాయి. ఈ రకంగా చాలా సమయం వృధా అవుతుంది. మరోవైపు వారానికి పది గంటలకంటే ఎక్కువగా టీవీ, కంప్యూటర్లను చూడటం ఆరోగ్యానికి క్షేమంకాదని వైద్యులు చెబుతున్నారు.

ఇక చివరిగా చెప్పుకోవాల్సిందేంటంటే.. ప్రతిరోజూ నిద్రపోవడానికి ముందుగా, ఆరోజు చేసిన పనులను, ఆ పనుల్లో సమయం వృధా అయ్యిందో, లేదో గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాత రోజు సమయం వృధా కాకుండా కార్యక్రమాల ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళికలో మనం చేయాల్సిన కార్యక్రమాలు, వాటికి వినియోగించాల్సిన సమయం తదితర విషయాలను నిర్ధారించుకుని, ఆ రకంగా కృషి చేస్తే, సమయం వృధా కాకుండా ఉంటుంది. అలా జీవితంలో లెక్కలేనన్ని విజయాలు మీ సొంతమవుతాయి, విజేతగా నిలుస్తారు.

వెబ్దునియా పై చదవండి