బడికెళ్లేటప్పుడు పిల్లలు కడుపులో నొప్పంటే.. జాగ్రత్త!

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:08 IST)
తనకు బడికి వెళ్లాలని లేదని, కడుపులో నొప్పిగా ఉందని, తలనొప్పిగా ఉందని పిల్లలు అంటే వాటిని తేలిగ్గా కొట్టిపారేయవద్దని మానసిక నిపుణులు అంటున్నారు. మెల్లగా పిల్లల్ని మాటల్లో పెట్టి వారి సమస్య ఏమిటో తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. యాంగ్జయిటీ అనే సమస్యకు ఇవే మూల కారణాలని వారు హెచ్చరిస్తున్నారు. 
 
పిల్లల్లోని భావోద్వేగాలను, ఆందోళనలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తే వారు ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వారితో మనస్సు విప్పి మాట్లాడాలి. 
 
వారి మనసులో ఆందోళన, భయమంటే ఏమిటో తెలుసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమలోని యాంగ్జయిటీని బయటకు ప్రదర్శించకుండా నిబ్బరంగా వ్యవహరిస్తే  తమ పిల్లలు యాంగ్జయిటీ సమస్యకు లోనుకాకుండా కాపాడుకోగలుగుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చినా.. ఇంటి సమస్యలకు సంబంధించిన కోపాలను పిల్లలపై చూపించకూడదు. 
 
పిల్లల ఎమోషనల్ హెల్త్‌ను కాపాడటంలో తల్లిదండ్రులెప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పెద్దవాళ్లలాగ అనుభవాల్లోంచి పాఠాలు నేర్చుకునే పరిణతి పిల్లల్లో ఉండదు. తమలోని యాంగ్జయిటీని వారంతట వారు తగ్గించుకోలేరు.
 
పిల్లల్లో యాంగ్జయిటీ సమస్య ఎక్కవయితే తరచూ ఏడవడం, తల్లిదండ్రులను పట్టుకుని వదలకపోవడం, సరిగ్గా నిద్రలేకపోవడం వంటివి చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో చిన్నారులను కావాల్సింది తల్లిదండ్రులు ఆప్యాయత అనేది గుర్తించుకోవాలి. లేకుంటే తప్పనిసరి అయినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలి.

వెబ్దునియా పై చదవండి