వేసవి కాలం ప్రారంభమైంది. భానుడి ప్రతాపానికి జనాలు ఠారెత్తిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు.
వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూడండి..
* మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి, ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
* వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. ఎండలో తిరిగి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగితే వడదెబ్బ బారినపడకుండా ఉంటారు. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాల స్థాయి సమతూకంలో ఉంటాయి.
* మజ్జిగను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
* కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి.