శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన సీఎం చంద్ర‌బాబు

గురువారం, 11 ఆగస్టు 2016 (22:14 IST)
విజ‌య‌వాడ ‌:  కృష్ణా పుష్కరాల సందర్భంగా తితిదే విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి, జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తితిదే అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
 
పుష్కరాల సందర్భంగా తితిదే చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్న తితిదే సిబ్బందిని అభినందించారు. భక్తులకు ఏయే ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారన్న విషయాన్ని జెఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తితిదే ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ప్రచురించిన మొత్తం 36 పుస్తకాలను గౌ|| ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ  సుధాకరరావు, ఎస్వీబీసీ సిఇవో నరసింహారావు, ప్రచురణల ప్రత్యేకాధికారి  ప్రయాగ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి