భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడేందుకు అదే మంచి టానిక్!

శనివారం, 4 అక్టోబరు 2014 (16:45 IST)
భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే.. సుతిమెత్తని మాటే మంచి టానిక్. మనసులోని మాటను సుతిమెత్తగా బయపటెట్ట గలిగిన నేర్పు ఎవరికుంటుందో వారు చక్కని సంబంధాలను ఏర్పరుచుకోగలుగుతారు. 
 
భార్యలో ఉన్న అందం లేదా మరేదైనా ప్రత్యేక అంశాన్ని వెనువెంటనే మెచ్చుకో గలిగిన భర్తల మాటలు ఆమెకు ఎక్కడ లేని శక్తినిస్తుంది. ఇంటి కోసం ఎంతో శ్రమపడే స్త్రీ తన శ్రమను మరచి పోగలిగేది భర్త నుంచి లభించే సాంత్వన వచనాలతోనే అనేది గమనించండి. 
 
"చాలా బాగా చేశావు.. చీర చాలా బాగా కట్టావు"లాంటి మాటలు ఆమెను గాలిలో తేలుస్తూ ఎటువంటి బాధ్యతనైనా నెత్తిన వేసుకునేలా చేస్తాయి. అటువంటి ప్రోత్సాహం, మంచి మాటలనే భర్త ఆశిస్తాడు. తాను చేసే ప్రతి పనిలో లోపం వెతికే భార్య ఎదురుగా ఎక్కువ సమయం గడపాలని ఏ భర్తా కోరుకోడు. పరుషమైన మాటలకు భయపడి ఇంటి బయటే ఎక్కువ సమయం గడిపేలా భర్తను దూరం చేసుకునే భార్యలున్నారు. 
 
తమ పరుషమైన మాటలవల్ల సంబంధం చెడుతున్నదని అర్థం చేసుకోకుండా.. అదే తంతును కొనసాగిస్తుంటారు. మాటలతో ఒక మనిషి లక్ష్యాన్ని మార్చవచ్చు. మాటలతో ఒక మనిషికి కొత్త శక్తిని అందించవచ్చు. మాటలతో ఒక మనిషిని అథఃపాతాళంలోకి నెట్టవచ్చు. ఇన్ని రకాలుగా వాడటానికి వీలున్న మాటల్ని సందర్భానుసారంగా వాడుకుంటే భార్యాభర్తల మధ్య అనురాగం బలపడుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి