గరళ కంఠుడు... ఆ పరమేశ్వరుడు

WD
ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు. మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం. ఈ విభూతి మహిమ అమోఘం. ఈ విభూతితోనే అరుంధతి, మృత విప్రుడిని బ్రతికించింది. బూడిద రాశులుగా మారిన కశ్యపాది మహర్షులను వీరభద్రుడు భస్మం చల్లి తిరిగి బ్రతికించాడు. దుర్వాసమహాముని శివుడు ప్రసాదించిన విభూతిని ధరించి, బ్రహ్మ హత్యాపాతకాన్ని నివారించుకున్నాడు. కుంభీపాక నరకంలో పడ్డ పాపాత్ములు, దుర్వాసమహాముని ధరించిన విభూతి రేణువులు పడగానే పుణ్యాత్ములుగా మారిపోయారు.

శివుడు దిగంబరుడు. అంటే దిక్కులనే వస్త్రంగా కలిగినవాడు. ఈ సమస్త విశ్వాన్ని ఆవరించియున్న ఆయనకు వస్త్రాల ఆవశ్యకత ఏముటుంది? లయకారకుడైన ఆయన చేతిలో త్రిశూలం శోభిల్లుతూ ఉంటుంది. ఆ త్రిశూలం సజ్జనులకు అభయదానం చేస్తూ, దుర్జనులను భయకంపితులను చేస్తుంటుంది. సజ్జన సంరక్షణార్థం బద్ధకంకణుడైన శంకరుడు, దుర్జన సంహారార్థం సర్వదా సన్నద్ధుడై ఉంటాడు. ఆయన మరొక చేతిలో ఢమరుకం ఉంటుంది. ఢమరుకం సంగీతానికి ప్రతీక. ఢమరుకం జ్ఞానోద్గాతమై శోభిల్లుతుంటుంది. పాణిని మహర్షికి వ్యాకరణ బీజాలు ఢమరుకం ద్వారానే లభించినట్లు చెబుతుంటారు. శంకరుడు ఢమరుకాన్ని పాణిని చెవిదగ్గర వాయించి వ్యాకరణ రహస్యాలను బోధపరిచాడట. ఈ ప్రపంచంలోని ఎన్నో అనుసంధానాలు ఈశ్వర కృప వల్లనే మానవమాత్రులకు సాధ్యమవుతుంటాయి.

అలాగే ఆయ శరీరంపై సర్వాలు, విషయాలకు ప్రతీకలు. పాము దంతాలను పీకివేసినప్పుడు, పాము ఎలా హానికరం కాదో, అలాగే నిర్విష విషయాలు కూడా హానికరాలు కావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలన్న ఈ వికారాలు అంత తేలిగ్గా పోయేవి కావు. కానీ, వాటిని అదుపులో ఉంచుకో గలిగితే, అవి ఎలాంటి హాని చేయవు.

శివుడు జ్ఞానదేవుడు. జ్ఞానులకు మాత్రమే ఇతరుల తప్పులు త్వరగా గోచరమవుతుంటాయి. క్షీరసాగర మథన వేళలో ప్రాదుర్భవించిన రత్నాలను అందరూ తీసుకున్నారు. దేవతలందరూ అమృతపానాన్ని గ్రోలేందుకు సన్నద్ధులై, హాలాహలం పుట్టడంతో భీతి చెంది పారిపోయారు. కేవలం శంకరుడు మాత్రమే ఆ గరళాన్ని పానం చేయగలిగాడు. అమృతాన్ని పానం చేసినవాడు దేవుడైతే, విషాన్ని పానం చేసినవాడు మహాదేవుడయ్యాడు. శంకరునిలా విషరూపాలైన దోషాలను తనలో ప్రవేశించనీయకుండా అదిమి పెట్టినవాడే జ్ఞాని అవుతాడు.

ఆయన బాలచంద్రుని తన శిరస్సుపై ధరించాడు. బాలచంద్రుడు కర్మయోగానికి ప్రతీక. యథార్థమైన కర్మయోగిని మాత్రమే మహాదేవుడు శిరస్సుపై ధరిస్తాడు. శివాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ముందుగా నందికి నమస్కరించాలి. ఎద్దుకు బుద్ధి తక్కువ అని అంటుంటారు. కానీ, భగవత్ జ్ఞానాన్ని మోస్తున్న నందీశ్వరుడు సకల శాస్త్ర పారంగతుడవుతాడు. అలాగే మనం కూడా స్వామి అందిస్తున్న అమృతమయమైన జ్ఞానసంపదను ఆస్వాదించగలిగితే జ్ఞానవంతులమవుతాము.

శివుని తలపైనున్న గంగ జ్ఞానగంగ - అలాగే ''శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తి:'' అన్నారు. బ్రహ్మ విద్యాశక్తి పార్వతిగా, బ్రహ్మము శివునిగా ద్యోతించిన తత్త్వాన్ని వైదిక సంప్రదాయం వర్ణిస్తే, ప్రకృతే పురుషాత్మక జగచ్చైతన్యమై శివశక్తుల సామరస్యమని ఆగమం ఆవిష్కరిస్తోంది.

అదేవిధంగా ఈ సమస్త విశ్వం ఒక లయకు అనుగుణంగా చలిస్తోందని నేటి ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా ఒప్పుకునే సత్యం.

ఈ విశ్వమంతా నామరూపాత్మకం. అంటే శబ్దమూ కాంతిమయం. వీటికి మూలమై నియంత్రించే చైతన్యం తానేనని తెలియజేస్తూ, ఢమరుకాన్ని, అగ్నిని తన చేతులలో ధరించి, అభయహస్తాన్ని, డోలాహస్తాన్ని, అభయలీలా ప్రదాయకునిగా ప్రకటించి, ఎడమపాదాన్ని ఎత్తి, శక్తి స్పందనని బోధిస్తూ, అపస్మార రాక్షసుని మర్దిస్తూ గోచరించే శివుని నటరాజమూర్తి, ఒక చెవికి మకర కుండలం, మరొక చెవికి తాటంకం ధరించి శివశక్తుల ఏకాత్వాన్ని చాటుతోంది. స్వామి నృత్యప్రియుడు. ఆయన చేసే నృత్యం తాండవమనబడుతుంది.

వెబ్దునియా పై చదవండి