సత్యం, శివం, సుందరం

శివప్రదత్వాత్ శివ
శివుడు సమస్తములైన మంగళములను అనుగ్రహించేవాడు. అందరి క్షేమమే శివతత్త్వం.

శివస్తధా సుకృతాది వశీకృతాధి తిష్ఠతి
సర్వం వశీకృతం యస్మాత్తస్మాత్ శివ ఇతి స్మృత:
-శివపురాణం
సకల విధములైన కర్మలను తన వశంలో ఉంచుకొనువాడు 'వశీ' అగుచున్నాడు. 'వశి'యే 'శివ' అయింది. శివ శబ్దానికి వశియనగా జితేంద్రియుడని అర్థం. అందుకే శివయ్య అందరికీ ఉపకారాన్ని చేస్తుంటాడు. సముద్ర మథనంలో పుట్టిన కాలకూట విషాన్ని సర్వలేకాల క్షేమార్థం తన కంఠంలో ధరించాడు.

అందుకే ఆయన సకల జీవకోటికి పరమేశ్వరుడు. సృష్టి, స్థితి, లయకారుడై, సర్వతత్త్వ ప్రబోధకుడై, శ్రీ దక్షిణామూర్తి స్వరూపుడై, ఆదిగురవై, ఈశానుడై, సర్వ విద్యా గురువైయ్యాడు.

ఆయన గరళాన్ని ధరించి గరళకంఠుడయ్యాడు. అంతేనా... గంగను ధరించి గంగాధరుడయ్యాడు. అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు. సర్వాలను ధరించి సర్పభూషణుడయ్యాడు. ఆయన ఏది చేసినా, దేన్ని ధరించినా, లోక కళ్యాణార్థమే!

స్వామిని 'సత్యం, శివం, సుందరం' అన్నారు. పరమమైన సత్యం, పరమశివం, పరమ సుందరం. అదే శివతత్త్వం.

ఆది దేవుడైన పరమశివుని ఆకృతి, అలంకరణలు కూడా ఎన్నో ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంటాయి.

మహాజటజూటం, చంద్రలేఖాధారణం, గంగాధరత్వం, త్రినేత్రాలు, గరళకంఠం, నాగాభరణాలు, భస్మధారణ, చర్మ వస్త్రాచ్ఛాదనం అంటూ స్వామి అలకరణల వెనుక ఎంతో నిగూఢార్థం ఉంది.

ఆయన మూర్తి ఎంతో సుందరమైనది. ఆయన గౌరవర్ణంలో శోభిస్తుంటాడు. తెలుపుదనం పవిత్రతకు గుర్తు. నిర్మలత్వాన్ని సూచిస్తుంటుంది. శివసాన్నిధ్యం కోరేవారు నిర్మల మనస్కులై, పరిశుద్ధులై ఉంటాలని చెప్పేందుకే ఈ గౌరువర్ణం.

వెబ్దునియా పై చదవండి