మంచు దుప్పటి కప్పుకున్న "గ్యాంగ్‌టక్" అందాలు

అందమైన మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, చూడముచ్చటైన కొండలు వీటితోపాటు సెలయేళ్లు, గడ్డిపూలు, పచ్చిక బయళ్లతో రారమ్మని స్వాగతం చెప్పే పర్యాటక ప్రాంతమే "గ్యాంగ్‌టక్". మనసుకు ఎంతగానో హాయినిచ్చే ఈ ప్రదేశంలోని మంచు పర్వతాలు, తీస్తానది ఒంపులు తనివితీరా ఆస్వాదించాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే మరి.

సిక్కిం రాష్ట్ర రాజధాని నగరమే గ్యాంగ్‌టక్. ఇది కొండల నగరంగా పేరుగాంచింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు అనే మూడు భాగాలుగా ఉంటుంది సిక్కిం రాష్ట్రం. వాటిల్లో ఉత్తర సిక్కింలోని దూర ప్రాంతాలవైపు వెళ్లాలంటే మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. ముందు రోజున చెబితే టూర్ ఆపరేటర్లే ఆ పనులన్నీ చేసి పెడతారు.

గ్యాంగ్‌టక్ చైనా, టిబెట్‌లకు సరిహద్దు ప్రాంతం కాబట్టి... అక్కడి ప్రజల రూపురేఖలు చైనీయులను పోలి ఉంటాయి. అందుకే బౌద్ధమత ఛాయలు ఈ పట్టణంలో ఎక్కువగా కనిపిస్తాయి. 1840లో ఎంకీ బౌద్ధాలయం నిర్మించిన తరువాత ఈ ప్రాంతం బౌద్ధులకు కేంద్రంగా మారిపోయింది. సముద్ర మట్టానికి 4,700 అడుగుల ఎత్తులో ఉండే ఈ గ్యాంగ్‌టక్ హిమాలయా పర్వతాల్లో ఒక భాగం.

గ్యాంగ్‌టక్ అంతా దాదాపుగా పర్వతమయమై ఉంటుంది. ఇక్కడ ఎత్తైన "వ్యూ పాయింట్స్" ఎన్నో ఉన్నాయి. వాటిలో గణేష్‌టక్ ముఖ్యమైంది. ఇక్కడికి వచ్చి నిలబడి చూసినట్లయితే పట్టణం అంతా కనిపిస్తుంది. ఇదేగాక రూమ్టెక్, ఎంకీ బౌద్ధాలయాలు, ఫ్లవర్ షో, తక్షీ వ్యూ పాయింట్, కేబుల్ కారు లాంటి చూడదగిన ప్రదేశాలెన్నో ఇక్కడ ఉన్నాయి.

మనకు అరుదుగా లభించే, స్ట్రాబెర్రీ పండ్లు ఈ నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. దారి పొడవునా లెక్కలేనన్ని స్టాబెర్రీ చెట్లు మనకు నోరూరిస్తాయి. అలాగే రోడ్లకు ఇరువైపులా ఎన్నో రకాల పువ్వుల చెట్లు హాయిగా మనల్ని పలుకరిస్తాయి. వసంత రుతువులో అయితే ఎటుచూసినా రంగురంగుల పుష్పాలు కనువిందు చేస్తాయి. కొండలు, లోయలూ, దట్టమైన అడవులనూ దాటుకుని గలగలా పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తుంటుంది తీస్తానది అందాలు మనల్ని సంతోషంలో ముంచెత్తుతాయి.

తెల్ల మబ్బుల తెరలు నెమ్మదిగా తెరుచుకుంటే, వెండి కొండ కాంచనగంగ హిమశిఖరం దర్శనమిస్తుంది. దాన్ని చూడగానే మనసంతా గిలిగింత పెట్టినట్లుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మూడో ఎతైన శిఖరం. దాని ఎత్తు 8586మీటర్లు. సిక్కిం రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి కనిపిస్తుందా శిఖరం. తెల్లవారగానే ఏ రోజైతే కాంచనగంగ స్పష్టంగా కనిపిస్తుందో ఆ రోజు విహారానికి అనువైన వాతావరణం అన్నట్టు అని అక్కడ చాలా మంది చెబుతారు. అలా కాకుండా పొద్దెక్కినా మంచుతో నిండి ఉంటే ఆ రోజు మధ్యాహ్నం వర్షం పడుతుందట.

గ్యాంగ్‌టక్‌ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే చుమ్‌థాంగ్‌కి చేరుకోవచ్చు. అక్కడే రెండు ఉపనదులు తీస్తాలో ఏకమౌతాయి. ఇక, అక్కడ లోయలో పచ్చిక బయళ్లూ తెలతెల్లని రాళ్లతో నిండిన నదీ.. ఆ దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి. అక్కణ్నుంచీ కూడ కాంచనగంగ పర్వత శ్రేణుల్ని చూడొచ్చు. ఇంకా కొంచెం ముందుకు పోతే లూఛుంగ్‌ ప్రదేశం చేరుకుంటాం. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత… 6 డిగ్రీలకు పడిపోతుంది.

లూఛుంగ్‌ నుంచి కొంత దూరం ప్రయాణిస్తే యుంథాంగ్‌ చేరుకుంటాం. ఈ ప్రాంతాల్లో మంచులో నడిచేందుకు ప్రత్యేకమైన బూట్లూ, చేతి తొడుగులూ టోపీలూ లూఛుంగ్‌ నుంచే తీసుకెళ్ళాలి. యుంథాంగ్‌ మీదుగా జీరోపాయింట్‌కి చేరాలి. అక్కడవాతావరణంలో ఆక్సిజన్‌ తక్కువ. అందుకే వీలైనంత నెమ్మదిగా నడవడం మంచింది. బయలుదేరుతున్నప్పుడే ఏదైనా ఓ జెల్లీని వెంట తీసుకెళ్తే బాగుంటుంది.

ఈ దారిపొడవునా రోడో డెండ్రాన్‌లు అక్కడక్కడా చిట్టడవులు, అడవి దున్నల్లా ఉండే యాక్‌లు ఉంటాయి. లోయలూ, చెట్లూ మంచూ అన్నీ దాటుకుని వెళ్తే అదే జీరోపాయింట్‌. అక్కడ ఒక సైనిక శిబిరం ఉంది. నిలబడి చుట్టూ చూస్తే... వెండి కొండల తోరణం. అక్కడ చిన్న శబ్దం చేసినా కొండలు ప్రతిధ్వనిస్తాయి. గంట గంటకూ మారే వాతావరణాన్ని చూడొచ్చు.

ఎలా వెళ్ళాలంటే... సిక్కిం నుంచి గ్యాంగ్‌టక్‌కు ట్యాక్సీలో వెళ్ళడానికి నాలుగు గంటలు సమయం పడుతుంది. బస్సు మార్గం అయితే.. సిలిగురి, డార్జిలింగ్‌, కాలింపొంగ్‌ మీదుగా జాతీయ రహదారి 31 ఎ సిక్కింకు వెళ్తుంది. ఈ రోడ్డు మార్గంలో అనేక బస్సులు, జీపులు, ట్యాక్సీలు వెళ్తుంటాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు మార్గం అయితే, గ్యాంగ్‌టక్‌కి 125 కిలీమీటర్ల దూరంలో న్యూ జల్‌పాయ్‌గురి అనే రైల్వేస్టేషన్‌ ఉంది.

ఇక్కడ నుంచి ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లడానికి వీలుంది. ఈ స్టేషన్‌ నుంచి నాలుగు గంటల ప్రయాణిస్తే గ్యాంగ్‌టక్‌కి చేరుకోవచ్చు. విమానంలో అయితే, పశ్చిమబెంగాలో బగ్దోగ్ర విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్ల దూరం. సిక్కిం టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ వారు ప్రతి రోజు బగ్దోగ్ర నుంచి గ్యాంగ్‌టక్‌కు విమానాలను నడుపుతున్నారు. 20 నిముషాల్లో గ్యాంగ్‌టక్‌కి చేరుకోవచ్చు.

చివరగా... ప్రకృతిని ఆస్వాదించేవారికి గ్యాంగ్‌టక్ చాలా బాగా నచ్చుతుంది. ఎత్తయిన కొండలు, లోయలు, అద్భుతమైన జలపాతాలు పొగమంచుతో కూడిన మేఘాలు మన శరీరాలను తాకుతూనే వెళ్తుంటాయి. ఈ ప్రాంతం గురించి చెప్పుకోవాల్సిన ప్రత్యేక అంశం ఏంటంటే... ఇక్కడ మచ్చుకు కూడా బిచ్చగాళ్లెవరూ మనకు తారసపడరు.

వెబ్దునియా పై చదవండి