మనసు పరిమళించే సుందర ప్రదేశం "కురుక్షేత్ర"

కురుక్షేత్ర అంటే మనం అందరం అనుకునే మహాభారత యుద్ధం జరిగిన స్థలంగా కాకుండా... అనేక యుగాలకు ముందు పరిపాలించిన "కురు" అనే చక్రవర్తికి జ్ఞాపకంగా ఏర్పడిన ప్రాంతమని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి.

కురుక్షేత్రలో అద్భుతమైన ఆలయాలుగానీ, కట్టడాలు ఉండవుగానీ... "బ్రహ్మ సరోవరం" అనే ఓ కొలను ఉంటుంది. పూర్వం చాలా పెద్దదిగా ఉండే ఈ బ్రహ్మ సరోవరాన్ని.. ఇటీవలి కాలంలో పునర్నిర్మించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 మీటర్లు, వెడల్పు 546 మీటర్లు. గ్రహణం సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడం చాలా పుణ్యమని చెబుతుంటారు. అందువల్ల ఉత్తర దేశంలోని చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజుల్లో కొన్ని లక్షలమంది కురుక్షేత్రను దర్శిస్తుంటారు.

బ్రహ్మ సరోవరం ఒడ్డునే రోడ్డుకు రెండో వైపున లక్ష్మీనారాయణుని పురాతన ఆలయం ఉంది. ఈ రోడ్డుకు ఆనుకునే ఈ మధ్య నిర్మించిన చిన్న, పెద్ద ఆలయాలు చాలానే ఉంటాయి. ఊరినుండి దూరంగా ఓ వైపున ఇటీవలనే నిర్మించిన చిన్న ఆలయం, దానికి ఆనుకుని ఓ పెద్ద దిగుడుబావి లాంటి చిన్నకొలను ఉంటాయి.

ఈ ఆలయంలోనే భీష్ముడు అంపశయ్యమీద పడుకున్న దృశ్యం ఉంటుంది. ఆ పక్కనే ఉండే కొలనులో నుండే అర్జునుడు వేసి బాణం ద్వారా పాతాళగంగ పైకి వచ్చినట్లు పూర్వీకుల కథనం. అలాగే ఊరికి మరోవైపున "జ్యోతి సర్" అనే కొలను ఉంది. దీని ఒడ్డునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లు స్థలపురాణం.

ఇక బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపున బిర్లా ధర్మశాల, జాట్ ధర్మశాలలు ఉన్నాయి. అయితే కురుక్షేత్ర అనే ఊరు మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగానే కురుక్షేత్ర, తానేశ్వర్ అని రెండు భాగాలుగా ఉంటుంది. "స్థానీశ్వరుడు" అనే పేరుగల దేవుడి ఆలయం ఇక్కడ ఉన్న కారణంగా ఆ ఊరికి స్థానీశ్వర్ అనే పేరు ఏర్పడి.. కాల క్రమంలో తానేశ్వర్ అయింది. తానేశ్వర్‌లో స్థానీశ్వరాలయం, భద్రకాళి ఆలయం అనే పురాతమైన ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే... న్యూఢిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్, జమ్మూల వైపు వెళ్లే రైలు మార్గంలో కురుక్షేత్ర ఉంటుంది. ఢిల్లీ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే... సుమారుగా నాలుగన్నర గంటల రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే... ఢిల్లీ నుంచి ప్రతి అరగంటకూ బస్సులు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి