హిమాలయా సానువుల్లో నెలవైన "కాంగ్రా"

స్థానిక ప్రజలు కాంగడా అని పిలుచుకునే ఈ "కాంగ్రా" ప్రాంతం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఈ రాష్ట్రం మొత్తం హిమాలయా పర్వత సానువుల మధ్యనే నెలకొని ఉండటమేగాక, చదునైన ప్రదేశం ఏదీ మనకు కనిపించదు. అయితే కాంగ్రా మాత్రం దీనికి మినహాయింపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, కాంగ్రా చుట్టుప్రక్కల కొంత మైదాన ప్రదేశం కూడా ఉంటుంది. దీన్నే కాంగడా లోయ అని అంటారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మిదిచోట్ల పార్వతీ అమ్మవారు స్వయంభూగా వెలిశారని పురాణాల కథనం. ఈ తొమ్మిది క్షేత్రాలను నవదుర్గలుగా ప్రజలు పూజిస్తుంటారు. వీటిలో చాముండ, కాంగ్రా, జ్వాలాముఖి, చింతపూర్ణి, నైనాదేవి అనే ఐదు క్షేత్రాలు 40 లేదా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

మిగిలిన ఆలయాలు మాత్రం కాస్తంత దూరదూరంగా నెలవై ఉంటాయి. ఇందులో కాంగ్రా ఆలయం అతి పవిత్రమైనదిగా భక్తులచే పూజలందుకుంటోంది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం నుంచి ఉన్నట్లు చరిత్రకారులు ధృవపరిచారు కూడా. సోమనాథ్ దేవాలయంలాగే, కాంగ్రా కూడా పలుసార్లు ముస్లిం పాలకుల దండయాత్రలలో ధ్వంసం చేయబడి.. ఆపై పునర్నిర్మించబడింది.

కాంగ్రా ఆలయంలోని అమ్మవారిపేరు వజ్రేశ్వరి. హిమాచల్‌ప్రదేశ్ మొత్తానికీ... కాంగ్రాలోని అమ్మవారే ఇలువేల్పు అని చెప్పవచ్చు. ఈ అమ్మవారి ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలోనే ఓవైపు భైరవుని మందిరం, మరోవైపు తారాదేవి అనే అమ్మవారి ఆలయం ఉంటాయి. వెనుక భాగంలో కాపాలి భైరవ అనే శివాలయం కూడా ఉంటుంది.

ఈ ఆలయంలో ఒక బావి ఉంటుంది. దీనిని చందన్ కుండం అని అంటారు. అమ్మవారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో వీరభద్ర ఆలయం, దానికి మరో రెండు కిలోమీటర్ల దూరంలో గుప్త గంగ అనే చిన్న కొలను ఉంటాయి. ఈ కొలను అర్జునుడు బాణం వేసినప్పుడు ఏర్పడినది అక్కడి ప్రజల విశ్వాసం.

కాంగ్రా ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లో వాయువ్యంలో ఉంటుంది. కాంగ్రా జిల్లాకు ముఖ్య పట్టణం ధర్మశాల. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి కాంగ్రాకు ఈశాన్యంగా ఉన్న జోగీందర్‌నగర్ వరకు ఉన్న నారోగేజ్ రైలుమార్గం కాంగ్రా ఊరిమీదుగా వెళుతుంది. అయితే రైళ్లు మాత్రం రోజుకు రెండు లేదా మూడు మాత్రమే ఉన్నాయి. పైగా ప్రయాణ సమయం ఎక్కువే.

కాబట్టి... పర్యాటకులు అందరూ ఎక్కువగా బస్సుల్లోనే కాంగ్రాకు వెళ్తుంటారు. ఈ చుట్టుప్రక్కల ఉండే అన్ని ప్రదేశాల నుంచి కూడా కాంగ్రాకు నేరుగా బస్సులు ఉన్నాయి. కాంగ్రా మరీ ఆధునికమైన పట్టణం ఏమీ కాదుగానీ... అన్ని తరగతుల పర్యాటకులకూ అందుబాటులో ఉండే విధంగా లాడ్జీలకు, వసతి సౌకర్యాలకు కొదవేమీ ఉండదు. ఇక మరెందుకు ఆలస్యం... మీరూ చూసి వస్తారు కదూ..?!

వెబ్దునియా పై చదవండి