గత మూడేళ్లలో 3,450 మంది రైతుల ఆత్మహత్యలు

శుక్రవారం, 7 మే 2010 (16:13 IST)
మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా గడచిన మూడేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా 3,450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ శుక్రవారం వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలోనే ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు.

ఆయన శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించిన గణాంకాల ప్రకారం 2007-09 మధ్య కాలంలో మహారాష్ట్రలో 1,720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,142 మంది, కర్ణాటకలో 434 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు చెప్పారు.

రైతుల ఆత్మహత్యలు 2010లో కొనసాగుతున్నాయన్నారు. విదర్భలో ఈ యేడాదిలో ఇప్పటి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే, 2008 సంవత్సరంతో పోల్చితే 2009 సంవత్సరంలో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు చెప్పారు.

జాతీయ స్థాయిలో 2008లో 1,237 మంది చనిపోగా, 2009లో 840 మంది ప్రాణాలు తీసుకున్నట్టు వివరించారు. ఈ బలవన్మరణాలు అన్ని ప్రధాన రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ఇందులోభాగంగా 16,978 కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించినట్టు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి