చెన్నయ్‌లో మరో అనంత పద్మనాభ స్వామి ఆలయం?

గురువారం, 10 నవంబరు 2011 (16:04 IST)
కేరళలోని తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం తరహాలో చెన్నయ్‌లో మరో ఆలయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చెన్నయ్ నగర శివారు ప్రాంతమైన గుమ్మడిపూండి సమీపంలో ఉన్న శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో అనంత సంపద దాగివున్నట్టు ఆలయ అధికారులు భావిస్తున్నారు.

శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సంపద బయటపడిన తర్వాత దేశంలోని పలు ఆలయాల్లో అటువంటి నేలమాళిగలు ఉండవచ్చుననే సందేహాలు ఉత్పన్నమయ్యాయి. దీంతో దేశంలోని అతిపురాతన ఆలయాలను ఆయా రాష్ట్రాల దేవాదాయ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

తాజాగా, చెన్నైలోని చంద్రశేఖర స్వామి ఆలయంలో అంతులేని సంపద నేలమాళిగల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 1200 యేళ్ళనాటి ఈ ఆలయంలో ప్రాచీన కాలం నాటి సంపద దాచివున్నట్టు సమాచారం. ఈ చంద్రశేఖర స్వామి ఆలయం చోళ, పాండ్య పాలకుల శిల్పా కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.

వచ్చే నెల ఒకటో తేదీన కుంభాభిషేకం చేసేందుకు గాను ఆలయంలో జీర్ణోద్ధారణ పనులు చేపట్టారు. ఆ సమయంలో ఆలయంలోని కోశాగారంపై ఆలయ అధికారులకు పలు అనుమానాలు సందేహాలు తలెత్తాయి. దీంతో ఆరు అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు గల సొరంగాన్ని తెరవాలని నిర్ణయించారు. దీన్ని ఈ నెల 16వ తేదీన తెరిచే అవకాశం ఉన్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి