అగ్ని-3 ప్రయోగం విజయవంతం: డీఆర్‌డీఓ

ఆదివారం, 7 ఫిబ్రవరి 2010 (16:10 IST)
ఒరిస్సా సముద్ర తీరంలో ఆదివారం చేపట్టిన అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్టు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రకటించింది. దమ్రా గ్రామంలో ఉన్న చిన్న వీలర్ దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. అగ్ని 3 క్షిపణిని ప్రయోగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

ఈ క్షిపణి విశ్వసనీయతను, సామర్థ్యాన్ని నిర్థారించుకోవడానికి చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చిందని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ప్రయోగం జరిపామని మిస్సైల్ ఇంజనీర్ తెలియజేశారు.

డిఆర్‌డిఓ తయారు చేసిన అగ్ని3 ఒకటిన్నర టన్నుల బరువున్న అణ్వస్త్రాలను మోసుకెళ్లగలదు. అలాగే, 3500 కిలో మీటర్లకు మించిన దూరం ప్రయాణించగలదు. చివరకు చైనాలోని కొన్ని నిర్ధేశిత లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలదని వారు తెలిపారు.

కాగా, మొదటిసారి అగ్ని 3 క్షిపణి ప్రయోగం 2006 జూలై 9వ తేదీన ప్రయోగించారు. కానీ అది విఫలమైంది. తరువాత 2007 ఏప్రిల్ 12న రెండవ సారి, 2008 మే 7న మూడవ సారి దీనిని ప్రయోగించారు.

ఈ రెండు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇపుడు 2010 ఫిబ్రవరి ఏడో తేదీన నిర్వహించిన ఈ ప్రయోగం కూడా విజయవంతం కావడం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి