అధ్యక్షుడి ఎంపిక తర్వాతే అద్వానీకి విరామం: ఆర్ఎస్ఎస్

ఆదివారం, 8 నవంబరు 2009 (10:37 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవడమే అనివార్యమే అయినప్పటికీ.. భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ స్పష్టం చేశారు. అద్వానీ 82వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు.

ఇదే రోజున అద్వానీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. వీటిని రామ్ మాధవ్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అందరూ ఊహిస్తున్నట్టుగా భాజపా కురువృద్ధుడు అద్వానీ ఆదివారం రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పదవీకాలం వచ్చే నెలాఖరుతో ముగియనుంది. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించి మిగతా తతంగం 2010 జనవరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాతే అద్వానీ వైదొలగుతారని మాధవ్ తెలిపారు.

అంతేకాకుండా, తన వారసుని ఎంపిక బాధ్యతను కూడా అద్వానీకే అప్పగించామని, ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఇకపోతే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి నుంచి అద్వానీ 2010 ఫిబ్రవరి - మార్చి నెలల్లో తప్పుకుంటారని వివరించారు.

వెబ్దునియా పై చదవండి