అన్నాజీ.. నా ఇంటిలో దీక్ష చేయండి: వరుణ్ గాంధీ వినతి

పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం ఈనెల 16వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టనున్న ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేకు భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ ఒక సూచన చేశారు. అన్నా హజారేకు దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెల్సిందే. దీంతో నిరాహారదీక్షను తన నివాసంలో చేసుకోవచ్చని హజారేకు వరుణ్ సూచించారు.

దీనిపై వరుణ్ మీడియాతో మాట్లాడుతూ హజారే కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. లోక్‌పాల్ అంశంపై బహిరంగ నిరశనకు అనుమతి నిరాకరించడంతోనే ఈ విషయంలో ప్రభుత్వం తీరు ఏంటో ఇట్టే అర్థమై పోయిందన్నారు. ఒకవేళ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలను ఇవ్వకపోతే ఈ ఉద్యమానికి తన నివాసం, అధికార నివాసాలను ఇవ్వడానికి గర్విస్తానని అన్నారు.

అన్నాహజారే కేవలం ఒక వ్యక్తి కాదు.. ఓ ఉద్యమం. నిజాయితీ, జవాబుదారీతనం, అవినీతి రహిత, సుసంపన్నమైన భారతం కోసం హజారే అహర్నిశలు కృషి చేస్తున్నారని వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి