అపఖ్యాతిపాలు చేసేందుకు ఆ వ్యాసం: తస్లీమా నస్రీన్

మంగళవారం, 2 మార్చి 2010 (13:04 IST)
తన రచనల్లో ఎక్కడా కూడా బుర్ఖాకు వ్యతిరేకంగా రాయలేదని బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పష్టం చేశారు. కన్నడ పత్రికల్లో తాను రాసినట్టుగా ప్రచురితమైన వ్యాసం తనను అపఖ్యాతిపాలు చేసేందుకే దాన్ని ప్రచురించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నస్రీన్ రాసిన ఒక ఆంగ్ల వ్యాసాన్ని కన్నడ దిన పత్రిక ఒకటి అనువాదం చేసి సోమవారం ప్రచురిచింది. ఇది ఒక వర్గం ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఫలితంగా షిమోగా, హాస్సన్ జిల్లాల్లో మత కలహాలు చెలరేగి, ఇద్దరు మృతి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో తస్లీమా తన వ్యాసంపై వివరణ ఇస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తనను అపఖ్యాతిపాల్జేందుకే తన రచనను తప్పుగా ప్రచురించారని మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల సమాజంలో అల్లర్లు చెలరేగుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా, కన్నడ వార్తాపత్రికలకు తాను ఒక్క వ్యాసాన్ని కూడా రాయలేదని ఆమె స్పష్టం చేశారు. చోటు చేసుకున్న సంఘటన తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. అయితే, దినపత్రికల్లో ప్రచురితమైన తన వ్యాసాన్ని తాను రాయలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తన జీవితకాలంలో ఎలాంటి ఆర్టికల్‌ను కన్నడ పత్రికలకు రాసి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

గత నెలలో యూరప్ నుంచి భారత్‌కు వచ్చిన తస్లీమాను ప్రస్తుతం గుర్తు తెలియని ప్రాంతంలో కేంద్రం ప్రభుత్వం ఉంచింది. కాగా, ఆమె వీసా కాలాన్ని కూడా వచ్చే ఆగస్టు వరకు కేంద్రం పొడగించింది. కర్ణాటకలో చోటు చేసుకున్న సంఘటనలపై ప్రకటనలో పేర్కొన్న వివరణ కంటే కొత్తగా చెప్పేది ఏమీ లేదని తస్లీమా తన ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి