అఫ్జల్ గురు ఉరిశిక్ష రద్దుపై మేం తీర్మానం చేస్తే: ఒమర్

గురువారం, 1 సెప్టెంబరు 2011 (09:58 IST)
పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకు మరణదండనను రద్దు చేయాలని తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఎవరు ఆపగలరు, పరిస్థితి ఏమిటని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో హంతకులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి జీవితశిక్షగా మార్చాలని కోరుతూ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఒమర్ అబ్దుల్లా పై విధంగా స్పందించారు.

తమిళనాడు అసెంబ్లీ తీర్మానంపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు ఉరిశిక్ష రద్దుకు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎలా ఆపగలరు? అంటూ ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ తరహాలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ అఫ్జల్ గురు ఉరిశిక్ష రద్దుకు తీర్మానం చేయదనుకుంటే అది పొరపాటే అవుతుందని ఒమర్ అన్నారు.

ఉరిశిక్షల అమలుపై ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదన్నారు. కాగా, ఉన్నత న్యాయస్థానం విధించిన శిక్షపై రాష్ట్ర శాసన సభ తీర్మానం చేయడంపై న్యాయనిపుణులూ, రాజకీయ పక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి