'అమర్‌నాథ్' ఒప్పందాన్ని స్వాగతించిన అద్వానీ

అమర్‌నాథ్ భూవివాదం పరిష్కారంలో భాగంగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి, శ్రీ అమర్‌నాథ్ సంఘర్షణ సమితి (ఎస్ఏఎస్ఎస్)ల మధ్య జరిగిన ఒప్పందాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్వాగతించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌లో 61 రోజుల పాటు సాగిన ఆందోళన హిందూ, ముస్లిం ప్రజల మధ్య తలెత్తిన అంశం కాదన్నారు.

ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వేర్పాటువాదులకు పూర్తిగా తలొగ్గిందని, అందుకే సమస్య జఠిలంగా మారి, హింసాత్మక సంఘటనలకు దారితీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అమర్‌నాథ్ యాత్రా సమయంలో 40 కనాల్‌ల భూములను వినియోగించుకునేందుకు అంగీకరించిన కాశ్మీర్ ప్రభుత్వం, ఆ ప్రాంతంలో శాశ్వత కట్టడాలు నిర్మించరాదనే షరతు విధించింది.

దీనిపై అద్వానీ స్పందిస్తూ.. తనకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రభుత్వానికి, ఎస్ఏఎస్ఎస్‌కు మధ్య పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చే ఒప్పందం కుదిరినట్టుగా ఉందన్నారు. కాశ్మీర్‌లోని శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు 40 ఎకరాల అటవీ భూములను కేటాయించి, ఆ తర్వాత రద్దు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా భాజపాతో సహా పలు సంఘ్ పరివార్ శక్తులు ఆందోళనకు దిగడంతో జమ్మూకాశ్మీర్‌లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 61 రోజుల పాటు ఈ ఆందోళనలు కొనసాగాయి.

వెబ్దునియా పై చదవండి