అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు

బుధవారం, 10 డిశెంబరు 2008 (09:56 IST)
ఇటీవలే ఎన్నికలు పూర్తయిన అయిదు రాష్ట్రాల్లో -ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరాం- నూతన ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం నాటికే దాదాపు విజేతలు ఎవరనేది ఖాయమైపోయిన స్థితిలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాట్లపై సందిగ్ధత తొలిగిపోయింది.

ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ బుధవారం సమావేశమై షీలాదీక్షిత్‌ను లాంఛనప్రాయంగా ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకోనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వరుసగా మూడుసార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతున్న తొలి మహిళగా ఆమె దేశ చరిత్రలో రికార్డు సృష్టించనున్నారు.

మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహన్‌ను బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. చత్తీస్‌ఘడ్‌లో బిజెపి ఎమ్మెల్యేలు రమన్ సింగ్‌ను నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు.

మిజోరాంలో 66 ఏళ్ల లాల్‌థన్‌వాలాను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకోవడానికి ప్రదేశ్ కాంగ్రెస్ బుధవారం సమావేశం కానుంది. రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వాన్ని మట్టి గరిపించిన అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవికి ముందు పీఠిలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి