ఆంటోనీ కమిటీ సభ్యులు బిజిబిజీ: రాజ్యసభలో షిండే ప్రకటన

FILE
ఆంటోనీ కమిటీ సభ్యులు బిజిబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర విభజనపై సందేహాలు, సమస్యలు తొలగించేందుకు కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ఇప్పట్లో పని ప్రారంభించేలా లేదు. కమిటీ సభ్యులందరూ ఎవరి పనుల్లో వాళ్లు తీరికలేకుండా బిజీబిజగా ఉండటంతో.. ఢిల్లీలో రాష్ట్ర నేతల అభ్యంతరాలు వినేవారే కరువయ్యారు.

రాష్ట్ర విభజన విషయంలో మరీ ముఖ్యంగా సీమాంధ్ర నేతల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకొనేందుకు ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి ఆదిలోనే అడ్డంకులు ఎదురౌతున్నాయి. కమిటీలోని నలుగురు కీలక సభ్యులు.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో ఢిల్లీలో సీమాంధ్ర నేతల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

కమిటీ ఆధ్యక్షుడు, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ క్షణం తీరికలేకుండా ఉన్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం జరుపుతున్న ఆగడాలపై ఇప్పటికే పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. విపక్షాలు ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగడంతో.. సభ్యులకు సమాధానాలు చెప్పేందుకు ఆయన తంటాలు పడుతున్నారు. ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగేంతవరకూ.. సీమాంధ్ర నేతల సమస్యలను వినేందుకు ఆంటోని సిద్ధంగా లేరు.

మరోవైపు రాష్ట్ర విభజనపై ముందునుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ కూడా మూడు నాలుగు రోజులపాటు అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. తాజాగా కర్ణాటక పర్యటనను ముగించుకొని ఆయన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌కు వెళ్లారు.

ఈ నెల 12వరకూ ఆయన అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లాకే విభజనపై చర్చలుంటాయని అధికారికంగా ప్రకటించడంతో సీమాంధ్ర నాయకులకు నిరాశే మిగిలింది. ఇక కమిటీ సభ్యుల్లో మరో కీలకమైన నేత అహ్మద్ పటేల్.

ఓవైపు రంజాన్ నెలలో బిజీగా ఉండి కూడా.. ఇప్పటిదాకా రాష్ట్ర విభజనపై జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించారు. కాగా సోమవారం సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై ప్రకటన చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి