ఆంటోనీ : భారత జవాన్లపై దాడి పాకిస్తాన్ దుశ్చర్యే!

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (09:30 IST)
FILE
ఇండో - పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చొరబాటు యత్నంపై రక్షణ శాఖమంత్రి ఏకే ఆంటోనీ గురువారం లోక్సభలో వివరణ ఇచ్చారు. నిన్నటికి నిన్న పాకిస్తాన్ హస్తం లేదన్న ఆయన.... విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మాట మార్చారు. భారతీయ జవాన్లపై దాడికి పాకిస్తాన్దే పూర్తి బాధ్యత అని ఆంటోని మరో ప్రకటన చేశారు.

మొదట లోక్‌సభలో చేసిన ప్రకటన ఆ సమయంలో తన వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చేసినట్టు వివరణ ఇచ్చారు. ఇపుడు పూర్తి సమాచారంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ సాయం లేనిదే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇటువంటి సంఘటనలు జరగవని స్పష్టం చేశారు.

జవాన్లపై దాడి ఘటనలో పాకిస్తాన్ బలగాలు కూడా పాల్గొన్నాయని చెప్పారు. పూంఛ్ సెక్టార్లో ఆర్మీ చీఫ్ పర్యటించారని ఆయన తెలిపారు. మొన్న తనవద్ద ఉన్న సమాచారంతో ప్రకటన చేసినట్లు ఆయన తాజాగా ప్రకటనలో వివరణ ఇచ్చారు.

కాగా, ఇండోపాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెల్సిందే. జవాన్ల మరణంపై రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటన చేయాలని విపక్షాలు బుధవారం పార్లమెంట్లో డిమాండ్ చేశాయి.

అయితే పాకిస్థాన్ సైనికులతోపాటు మరో 20 మంది తీవ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి భారత్ సైనికులపై కాల్పులు జరిపారని ఆంటోనీ పార్లమెంట్లో వివరించారు. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన గురువారం మరో ప్రకటన చేయాల్సి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి