ఎన్డీయే కూటమిలో చేరిన ఆర్.ఎల్.డి

కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. ఎన్డీయే కూటమితో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ఆ పార్టీ అధినేత అజిత్ సింగ్ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రీజియన్‌లో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆర్.ఎల్.డి పోటీ చేస్తుంది. మిగిలిన 73 ఎంపీ సీట్లలో భాజపా అభ్యర్థులు బరిలోకి దిగుతారు.

దేశ రాజకీయాలకు గుండె కాయలాంటి ఉత్తప్రదేశ్‌లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు పట్టు కోల్పోయిన విషయం తెల్సిందే. ప్రాంతీయ పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలకు ఓటర్లు పెద్దపీట వేయడంతో కాంగ్రెస్, భాజపాలు పొత్తుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇందులోభాగంగా, కాంగ్రెస్ ఎస్పీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆర్‌ఎల్‌డితో భాజపా పొత్తు పెట్టుకుంది.

దీనిపై భాజపా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ కొత్త కూటమిపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎస్పీ, బీఎస్పీలకు ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతీయ కూటమి రాష్ట్రంలో ఆవిర్భవించిందన్నారు. అజిత్ సింగ్‌తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భాజాప సీనియర్ నేతలైన అద్వానీ, అరుణ్ జైట్లీ, జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి