ఎన్నికల కొలనులో 'కమలం'

శనివారం, 5 జులై 2008 (11:18 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు తహతహలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. తదనుగుణంగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తోంది.

ఇందులోభాగంగా ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి ఎన్నికల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, లోక్‌సభ ప్రతిపక్ష నేత ఎల్కే.అద్వానీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో సహా మరో నలుగురు ఉన్నారు. వీరంతా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎన్నికైన అద్వానీ.. మరోసారి అక్కడ నుంచే ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

ఈ స్థానం తనకు కంచుకోట అయినప్పటికీ.. ఏ ఒక్క అవకాశాన్ని కమలనాథులు వదులుకోదలుచుకోలేదు. అందుకే ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తన ప్రచారంలో నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలతో పాటు దేశ అంతర్గత భద్రత, ఉగ్రవాదం/తీవ్రవాదం తదితర అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి