ఎన్నికల తేదీల ఖరారుపై ఈసీ నేడు భేటీ

సార్వత్రిక ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమావేశం సానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం అసెంబ్లీలకు కూడా పలు విడతలుగా పోలింగ్‌ నిర్వహించనుంది. అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా లోక్‌సభ ఎన్నికల తేదీలతోనే ప్రకటించనున్నారు. షెడ్యూలు ఖరారుపై సోమవారం ఎన్నికల సంఘంలోని త్రిసభ్య కమిటీ భేటీ అవుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు తొలి విడత బ్యాలెట్‌ పోరు ఏప్రిల్‌ 15వ తేదీన జరగవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. దీనికి తగినట్టుగానే షెడ్యూలు విడుదల చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం... షెడ్యూలు ప్రకటనకు, నోటిఫికేషన్‌ విడుదలకు మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి.

నోటిఫికేషన్‌ తర్వాత నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణకు 10 రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రచారం కోనం కనీసం 14 రోజులు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే.. తొలివిడత పోలింగ్‌కు కనీసం 45 రోజుల ముందు ఎన్నికల షెడ్యూలు ప్రకటించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఈసీ సోమవారం భేటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివే కావడం గమనార్హం. అలాగే... జమ్మూ కాశ్మీర్‌, అస్సోం, నాగాలాండ్‌ మినహా దేశవ్యాప్తంగా మొదటిసారిగా ఓటరు గుర్తింపు కార్డుల ఆధారంగా పోలింగ్‌ జరగనుంది.

వెబ్దునియా పై చదవండి