ఎన్నికల "నగారా"ను మోగించిన ఈసీ

సోమవారం, 2 మార్చి 2009 (16:39 IST)
15వ లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో సహా మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించనుంది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 16న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. చివరి దశ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతాయి. దేశంలోని 523 పార్లమెంట్ స్థానాల్లో ఫోటో గుర్తింపు కార్డుల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.

ఇందుకోసం దేశ వ్యాప్తంగా 8,28,824 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 71.40 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో సహా, మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఇందులో కూడా జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే బీహార్‌లో నాలుగు దశల్లోనూ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సోం, జార్ఖండ్, ఒరిస్సా, కర్ణాటక, పంజాబ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 15 రాష్ట్రాలతో సహా, కేంద్ర పాలిత రాష్టాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల షెడ్యూల్
మొత్తం నియోజకవర్గాలు 543

తొలి దశ
మొత్తం స్థానాలు.. 124
పోలింగ్ తేదీ.. ఏప్రిల్ 16

రెండో దశ..
మొత్తం స్థానాలు.. 141
పోలింగ్ తేదీ.. 23 (స్థానిక సెలవుదినం కారణంగా మణిపూర్‌లోని ఒక స్థానానికి మాత్రం ఏప్రిల్ 22వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు).

మూడో దశ..
మొత్తం స్థానాలు.. 107
పోలింగ్ తేదీ.. ఏప్రిల్ 30

నాలుగో దశ..
మొత్తం స్థానాలు.. 85
పోలింగ్ తేదీ.. మే 07

ఐదో దశ..
మొత్తం స్థానాలు 86
పోలింగ్ తేదీ.. మే 13

ఓట్ల లెక్కింపు.. మే 16.

వెబ్దునియా పై చదవండి