ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర విభజన సాధ్యం: జితేంద్ర సింగ్

బుధవారం, 7 డిశెంబరు 2011 (19:10 IST)
ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించాలంటే తప్పనిసరిగా ఏకాభిప్రాయం కుదరాలని హోంశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకమైన సమాధానాన్ని అందజేశారు.

ఆ సమాధానంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని వివరణ ఇచ్చారు. ఏకాభిప్రాయ సాధనతోనే కొత్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమనీ, ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించాలంటే ఏకాభిప్రాయం విధిగా అవసరమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

హోంశాఖ సహాయమంత్రి సమాధానంతో తెలంగాణపై యూపీఎ ఇప్పడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంటు సమావేశాలు ముగిశాక ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

ఈ నేపధ్యంలో పార్లమెంటు ముందు తెలంగాణ ఎంపీలు చేస్తున్న ధర్నాలు కూడా గాలిలో కలిసిపోయేవే అని చెప్పవచ్చు. మొత్తమ్మీద రాష్ట్ర విభజనపై యూపీఎ సర్కార్ తన నాన్చుడు ధోరణిని అలాగే కొనసాగిస్తోంది. చివరికి ఏం చేస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి