ఐదేళ్లలో సంపూర్ణ మహిళా అక్షరాస్యత: ప్రధాని

వచ్చే ఐదేళ్లకాలంలో దేశంలోని మహిళలందరినీ అక్షరాస్యులుగా మారుస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో దేశంలో సంపూర్ణ మహిళా అక్షరాస్యత సాధిస్తామన్నారు. భారత ఆర్థికాభివృద్ధిని మహిళా నిరక్షరాస్యత, మౌలిక సదుపాయాల కొరత అడ్డుకుంటున్నాయని తెలిపారు.

ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం రూ.65 బిలియన్ల (1.3 బిలియన్ డాలర్లు) వ్యయంతో చేపట్టే సాక్షార్ భారత్ అనే అక్షరాస్యతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి ఆర్థిక రంగంలో మౌలిక సదుపాయాల కొరత, సామాజిక రంగంలో మహిళా నిరక్షరాస్యత దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. చాలా మంది నిపుణుల అభిప్రాయం కూడా ఇదేనని చెప్పారు.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజున ప్రధాని ఈ సాక్షార్ భారత్ కీలక పథకాన్ని ప్రారంభించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం సరసన ఈ కొత్త కార్యక్రమం కూడా చేరనుంది. తమ పథకాలు విజయవంతం కావడానికి అక్షరాస్యత, ముఖ్యంగా మహిళా అక్షరాస్యత చాలా కీలకమని ప్రధాని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి