ఒకటి రెండు రోజుల్లో సంక్షోభానికి తెర: యడ్యూరప్ప

గురువారం, 5 నవంబరు 2009 (09:53 IST)
కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఒకటి రెండు రోజుల్లోనే తెరపడుతుందని ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే, ఈ సంక్షోభ పరిష్కారానికి చేసుకున్న రాజీ ఫార్ములా వివరాలను ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు.

అధిష్టానం పిలుపు మేరకు హస్తినకు చేరుకున్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తన కేబినెట్‌లో మంత్రులైన గాలి జనార్ధన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలకు, తనకు మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయని, అన్ని సమస్యలు ఓ కొలిక్కి వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే నిమిత్తం పార్టీ జాతీయ నేతలు అద్వానీ, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్‌లతో సమావేశమైనట్టు తెలిపారు. అన్ని సమస్యలకు ఈ రోజు 99 శాతం పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యకు ఏదైనా రాజీ ఫార్ములాను ప్రతిపాదించారా అని ప్రశ్నించగా, ఏ ఒక్కరూ రాజీ ఫార్ములాతో ముందుకు రాలేదన్నారు.

తామంతా ఒకచోట కూర్చొని సమస్యను చర్చించుకుని, చివరగా ఓ నిర్ణయానికి వస్తామన్నారు. గాలి సోదరులతో ఉన్న అన్ని రకాల విభేదాలను పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి పదవి నుంచి మిమ్మలను తొలగిస్తారా అనే ప్రశ్నకు యడ్యూరప్ప సమాధానం ఇస్తూ.. ఈ అంశంపై జాతీయ నాయకులే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి