ఒబామాతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్ సింగ్!

FILE
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌ భేటీ కానున్నారు. వచ్చే వారం అమెరికాలో ప్రారంభం కానున్న అణు సదస్సులో మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో భాగంగా.. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇంకా అణుశక్తి ఒప్పందంపై ఒబామా-మన్మోహన్ సింగ్‌లు కీలక చర్చలు జరుపుతారని తెలిసింది.

ఇదిలా ఉంటే.. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఏప్రిల్‌ 12న జరిగే అణు సదస్సులో 42 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఉగ్రవాద అణు ప్రమాదాలను ఎలా నియంత్రించాలో సదస్సులో చర్చిస్తారు. అంతర్జాతీయ అణు భద్రతా కేంద్రాన్ని భారత్‌లోను ఏర్పాటుచేసే అంశాన్ని మన్మోహన్‌ సదస్సులో ప్రస్తావించనున్నారు.

ఇంకా ఈ సదస్సులో పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ పాల్గొంటారు. అయితే గిలానీ-మన్మోహన్ సింగ్‌ల మధ్య ఎలాంటి చర్చలు ఉండవని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి