ఒమర్ అబ్ధుల్లాది రాజద్రోహం.. చర్యలు తీసుకోండి: జోషి

FILE
జమ్మూ-కాశ్మీర్ భారతదేశంలో విలీనం కాలేదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా చేసిన ప్రకటన రాజద్రోహంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి డిమాండ్ చేశారు.

రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లాకు తగదని జోషి సూచించారు. వేర్పాటు వాదుల డిమాండ్‌ను ఒమర్ పరోక్షంగా బలపరుస్తున్నారని జోషీ అభిప్రాయ పడ్డారు.

స్వదేశీ సమస్యను అంతర్జాతీయ వివాదంగా మార్చటానికి ఒమర్ ప్రయత్నించటాన్ని అనుమతించరాదని జోషీ చెప్పారు. మన అంతర్గత సమస్య పరిష్కారంలో పాక్ లేదా మరో తృతీయ శక్తిని అనుమతించరాదని ఆయన తేల్చి చెప్పారు.

కాశ్మీర్‌ మన దేశంలో విలీనం కావడాన్ని అప్పటి గవర్నర్ జనరల్ హర్షించారని, మన రాజ్యాంగంలోని ఒకటో అధికరణలో ఉండే రాష్ట్రాల జాబితాలో జమ్మాకాశ్మీర్ 15వ స్థానంలో ఉందని జోషి పేర్కొన్నారు.

అలాగే భారతదేశంతో పాటు పాకిస్థాన్ కూడా తీవ్రవాదానికి బలైపోతోందని వ్యాఖ్యానించడంతో పాటు పాక్ ప్రేరేపిత తీవ్రవాదం ఆగకపోయినప్పటికీ చర్చల ప్రక్రియను కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయం సరికాదని జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తీవ్రవాదుల విషయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు దిగజారిపోవడానికే గాకుండా కాశ్మీర్ భారతదేశంలో విలీనం కాలేదని ఒమర్ అబ్ధుల్లా తిరుగుబాటు చేసే స్థాయికి తీసుకొచ్చిందని జోషి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి