కంప్యూటర్ నెట్‌వర్క్‌తో పొంచివున్న ముప్పు: ఆంటోనీ

శనివారం, 17 ఏప్రియల్ 2010 (09:09 IST)
కంప్యూటర్ నెట్‌వర్క్‌తో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచివుందని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, చైనీస్ హాకర్ల నుంచి ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ రక్షణ, దౌత్య విభాగాలకు చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌ల నుంచి చైనీస్ హాకర్లు కీలక సమాచారాన్ని అపహరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను చేపట్టనున్నట్టు చెప్పారు.

దీనిపై ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. సైబర్ నేరాల నిరోధానికి ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలతో కలిసి ఒక విపత్తుల నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన కోరారు. ఇటీవలి కాలంలో ప్రమాదకరమైన సైబర్ నేరాలు వెలుగు చూశాయన్నారు. ఇది సైబర్ భద్రతలోని లోపాలను ఎత్తిచూపినట్టుగా భావించాలన్నారు.

సైబర్ దాడులు, సైబర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కంప్యూటర్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి), ఎన్‌టిఆర్‌ఓ, హోంశాఖ, ఐటి శాఖలు సమన్వయంతో ఒక విపత్తుల నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో కంప్యూటర్ నెట్‌వర్క్‌ల నుంచి కీలక సమాచారం అపహరణకు గురికాకుండా ఉండేందుకు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఆంటోనీ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి