కట్నంకోసం వేధించేవారిని ఉరితీయాలి: సుప్రీం

వరకట్నం కావాలని మహిళలను వేధించి, వారిని కాల్చి చంపేవారిపై ఎలాంటి కనికరం చూపకూడదని, అలాంటివారిని ఉరితీయాలని సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. దేశంలో జరుగుతున్న ఈ దురాగతాలను నియంత్రించాలంటూ కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వరకట్న హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భర్తకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.

వివరాలలోకి వెళితే...హర్యానాలోని భివానీ జిల్లాలో రజని అనే మహిళను తన భర్త అయిన మహేందర్ కుమార్ గులాటితో సహా అత్తింటివారు ముగ్గురు ఆమెపై కిరోసిన్ పోసి వారి ఇంట్లోనే నిప్పంటించి చంపేశారు.

వరకట్నంకోసం అత్తింటి వారు ఈ దురాగతానికి పాల్పడటంతో రజనీ మరణ వాంగ్మూలం ఆధారంగా దోషులుగా తేలిన మహేందర్ కుమార్, ఆతని అన్న ప్రేమ్ కుమార్ గులాటీకి, ప్రేమ్ కుమార్ భార్యకు హర్యానాలోని దిగువకోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.

దిగువ కోర్టు తీర్పును పంజాబ్, హర్యానా హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ మహేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

బెయిల్‌ పిటిషన్‌పై విచారిస్తున్న సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనంలో జస్టిస్ మార్కండేయ కట్టు, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన ఈ ధర్మాసనం అతడిని ఉద్దేశించి మీరు చేసిన పని అతి క్రూరమైన పని అని, ఇది అనాగరిక చర్య, నీవు చేసిన నేరానికి నిన్ను ఉరి తీయాలని వ్యాఖ్యానించింది.

స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో వారిపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఇది ఆటవిక ప్రవృత్తి అని ధర్మాసనం పేర్కొంది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించే వారిని ఉరి తీయాలని చెప్పింది. నీకు ఎలాంటి ఉపశమనము కలిగించేది లేదు. నువ్వు తర్వాత మరో ధర్మాసనం ఎదుట నీ అదృష్టం పరీక్షించుకో అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి