కర్ణాటక సంక్షోభం ముగిసి పోలేదు: గాలి జనార్ధన్ రెడ్డి

శనివారం, 7 నవంబరు 2009 (15:04 IST)
ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప మార్పు అంశంపై కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ సర్కారులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదని ఆ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి, అసమ్మతి వర్గం అధినేత గాలి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

అలాగే, ముఖ్యమంత్రితో తాను రాజీ ఫార్ములా కుదుర్చుకున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను కూడా కొట్టిపారేశారు. అంతేకాకుండా, తన అసమ్మతి శిబిరాన్ని ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు మార్చారు. ఫలితంగా కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తిగా మారింది.

దీనిపై జనార్ధన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్, పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలు దృష్టిలో ఉంచుకుని అధినాయకత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు.

తనకు ముఖ్యమంత్రికి మధ్య రాజీ ఫార్ములా కుదిరిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అసత్య వార్తలు ఎలా వస్తున్నాయి. వీటికి మార్గాలేమిటో కూడా తెలియవన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని, ఈ రోజు వరకు కూడా అలానే ఉంటున్నట్టు తేల్చి చెప్పారు.

ఇదిలావుండగా, శనివారం ఉదయం ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నందుకు, తనపై మరోమారు నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం తన నేతృత్వంలో పూర్తి కాలం మనుగడ సాగిస్తుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి