కాంగ్రెస్‌ను "కరుణ" బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: జయలలిత

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిపై ఎఐఎడిఎంకె అధ్యక్షురాలు జయలలిత మరోసారి మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని జయ విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ జరిపించాలని ఆమె పునరుద్ఘాటించారు.

ఈ వివాదంలో కాంగ్రెస్‌ను కరుణానిధి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. చెన్నైలోని ఓ సినిమా కార్యక్రమంలో కరుణానిధి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఇటువంటి కార్యక్రమాలను రూ. 1.76 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టెలికాం మంత్రి ఎ.రాజాను కాపాడేందుకు కరుణానిధి వేదికగా వినియోగించుకుంటున్నారని ఆమె విమర్శించారు.

ఇటువంటి వేదికలపై కరుణానిధి పురాణాల్లోని కథలు చెబుతూ.. రాజా ఒక్కడే ఇన్ని కోట్ల రూపాయల అవినీతికి ఎలా పాల్పడతారని ఆయన అనడాన్ని జయ గుర్తు చేశారు. స్పెక్ట్రమ్‌ విచారణపై కాంగ్రెస్‌ నాయకత్వం నెమ్మదిగా వ్యవహరించడాన్ని చూస్తుంటే కరుణానిధి కూటమి భాగస్వామిని బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి