కాంగ్రెస్- టీసీ పొత్తుపై సోనియాదే తుది నిర్ణయం

మంగళవారం, 3 మార్చి 2009 (11:25 IST)
FileFILE
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీసీ)తో కుదిరిన పొత్తుకు సంబంధించి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను రెండు పార్టీలు కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి జరిపిన చర్చల వివరాలను సోనియా గాంధీ దృష్టికి తీసుకెళనున్నట్లు ప్రణబ్ తెలిపారు. అనంతరం సోనియా గాంధీ దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పారు. పొత్తుకు సంబంధించిన నివేదికను త్వరలోనే సోనియాకు పంపుతామన్నారు.

ఇదిలావుండగా, తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు మమతా బెనర్జీ అంగీకరించారు. రాష్ట్రంలోని వామపక్ష కూటమికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి