కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు అర్జున్ సింగ్ కన్నుమూత

శుక్రవారం, 4 మార్చి 2011 (20:03 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీకేంద్రమంత్రి అర్జున్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 81. 1930 నవంబరు 5వ తేదీన జన్మించిన అర్జున్ సింగ్ 1980-85, 1988-89 మధ్యకాలాల్లో రెండు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004-2009లో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర మావనవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 1957లో మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎంపికైన అర్జున్ సింగ్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక పదవులను అలంకరించారు.

కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో పాటు.. నరాల సమస్యలు ఉత్పన్నం కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, శుక్రవారం సాయంత్రం 17.30 గంటల ప్రాంతంలో ఊపిరాడటం లేదని వైద్యులకు చెప్పాడు. ఆ తర్వాత 18.15 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.

అర్జున్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగానే కాకుండా ఇంకా కీలకమైన పలు పదవులు చేపట్టారు. గాంధీ కుటుంబానికి ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉన్న అర్జున్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు.

రాజీవ్ గాంధీ హయాంలో పంజాబ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేశారు. శుక్రవారం ప్రకటించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అర్జున్ సింగ్‌ను శాశ్వత సభ్యునిగా ప్రకటించారంటే ఆయనకు పార్టీలో ఉన్న ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమవుతుంది.

అర్జున్ సింగ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి