కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారానికి అన్నా హజారే స్వస్తి?

మంగళవారం, 10 జనవరి 2012 (14:02 IST)
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలన్న గాంధేయవాది అన్నా హజారే ఆలోచనకు ఆయన స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి అంతానికి పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోసం హజారే గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే.

అయితే, ఆయన కోరిన విధంగా బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో ఈ యేడాది ప్రథమార్థంలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయంపై ఆయన వెనక్కి తగ్గే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై అన్నా బృందంలోని ఇతర సభ్యులతో చర్చించిన తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదేసమయంలో లోక్పాల్ బిల్లు కోసం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమించాలని నిర్ణయించారు.

అదేసమయంలో లోక్పాల్ బిల్లు కోసం మద్దతు తెలుపాలని కోరుతూ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అన్నా బృందం నిర్ణయించుకుంది.

వెబ్దునియా పై చదవండి