కాశ్మీర్ లోయలో మళ్లీ ఉద్రిక్తలు: కర్ఫ్యూ

కాశ్మీర్ లోయలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆదివారం లోయలో కర్ఫ్యూ విధించారు. లోయలోని వేర్పాటువాదులంతా కలిసి భారీ ర్యాలీని నిర్వహించ తలపెట్టారు. ఈ కారణంగా లోయలో ఘర్షణలు చెలరేగకుండా ఉండేందుకు ముందుస్తు చర్యగా కర్ఫ్యూను విధించినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా లాల్‌చౌక్‌లో జరిగే నిరసన కార్యక్రమంలో వేలాది మంది కాశ్మీరీలు పాల్గొంటారని హురియత్ అతివాద వర్గానికి చెందిన సయ్యద్ ఆలీషా గిలానీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్రభుత్వం పోలీసు, భద్రతా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది.

అమర్‌నాథ్ ఆలయ భూ కేటాయింపు వ్యవహారం ఇటీవలే సద్దుమణిగి లోయలో ప్రశాంత వాతావరణం నెలకొంది. తాజాగా వేర్పాటు వాదులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీ కారణంగా లోయలో మళ్లీ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

వెబ్దునియా పై చదవండి