ఖైదీల క్షమాభిక్షకు అభ్యంతరం లేదు: సుప్రీం

FILE
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పలేదు. ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 338 జీవోను నిలిపేయాలని గల్లా సతీష్ అనే న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది.

ఖైదీల విడుదల ప్రక్రియను కొనసాగించడానికి ప్రభుత్వానికి అనుమతినిస్తూ తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. తీవ్రమైన నేరాల కింద శిక్షపడ్డ వారిని మాత్రం విడుదల చేస్తే తిరిగి అరెస్ట్ చేయిస్తామని స్పష్టం చేసింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జులై 24న 338 నెంబర్ జీవో విడుదల చేసింది. దీని కోసం మార్గదర్శకాలు జారీచేసింది.

జైళ్లశాఖ డి.జి. అర్హులైన ఖైదీల జాబితాను పంపితే, హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఆ జీవోలో పేర్కొన్నారు.

గవర్నర్ అనుమతి లేకుండా ముఖ్యకార్యదర్శి జీవోను విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ కె.జి.బాలకృష్ణన్, జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ బి.ఎస్.చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ వాదించారు.

తీవ్రమైన కేసుల్లో శిక్షపడ్డవారిని విడుదల చేసే అవకాశాన్ని జీవోలో కల్పించినట్లు విన్నవించారు. ఆర్టికల్ 72, 161 ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్‌కే ఉందని, అది కూడా వ్యక్తిగతంగా తన ముందుకొచ్చే కేసులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోనున్నవెయ్యిమంది ఖైదీలను ఒకేసారి విడుదల చేయకూడదని పేర్కొన్నారు. వీరిని ఏ చట్టం ప్రాతిపదికన విడుదల చేస్తున్నదీ ప్రభుత్వం చెప్పలేదని ఆ పిటీషనర్ పేర్కొన్నారు. జీవిత ఖైదీలను గవర్నర్ ఆదేశాలు లేకుండా కార్యనిర్వాహక ఆదేశాలతో విడుదల చేయడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే మంజూరు చేయాలని పిటీషనర్ సతీష్ కోరారు.

దీంతో వాదనలు విన్న సుప్రీం కోర్టు స్టేకి నిరాకరిస్తూ ఈ కేసును 24వ తేదీకి వాయిదా వేసింది. జాబితా తయారుచేసి గవర్నర్ అనుమతి తీసుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. తీవ్రమైన నేరాల్లో శిక్షపడ్డ వారు విడుదలయితే వారిని తిరిగి అరెస్ట్ చేయిస్తామని స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి