గత ఎన్నికల్లో అతి విశ్వాసం వల్లే ఓడాం: అద్వానీ

మంగళవారం, 3 మార్చి 2009 (09:34 IST)
FileFILE
గత పార్లమెంట్ ఎన్నికల్లో అతి విశ్వాసం వల్లే తాము ఓటమి పాలైనట్టు ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన ఆ పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ప్రసంగించిన అద్వానీ.. ఆరేళ్ల పాటు వాజ్‌పేయి నేతృత్వంలో అధికారంలో ఉన్న తర్వాత, ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా వచ్చిందని చెప్పారు.

అయితే తాము ఉపయోగించిన 'భారత్‌ వెలిగిపోతోంది' నినాదాన్ని ప్రతిపక్షాలు సామాన్యుడి ముంగిట్లోకి తీసుకెళ్లాయని అన్నారు. ప్రతి గ్రామంలో, ఇంట్లో, ఏదో ఒక సమస్య ఉన్న నేపథ్యంలో ఆ నినాదాన్ని ఉపయోగించుకున్న ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించాయన్నారు. ఫలితంగా తాము ఊహించిన దానికంటే వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయన్నారు.

అయితే ఆ ఎన్నికల్లో సామాన్యుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ హయాంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 3.5 కోట్ల నుంచి 5.5 కోట్లకు పెరిగిందని అద్వానీ వెల్లడించారు.

వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం తాము అధికారంలోకి వస్తే, రిటైల్‌ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడులను అనుమతించడం వల్ల మధ్యతరగతి, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతారని, దీనికి తాము అడ్డుకట్ట వేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి